ఆమ్ ఆద్మీ పార్టీ దూకుడు.. మరో రాష్ట్రంలో గుర్తింపు

9 Aug, 2022 15:28 IST|Sakshi

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించేందుకు అడుగుదూరంలో ఉందని నొక్కి చెప్పారు పార్టీ జాతీయ కన్వినర్‌, ఢిల్లీ ముఖ‍్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌. ఈ సందర్భంగా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, వలంటీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గోవాలో ఆప్‌ను రాష్ట్రస్థాయి పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన క్రమంలో ఈ మేరకు ట్వీట్‌ చేశారు కేజ్రీవాల్‌.

‘ఢిల్లీ, పంజాబ్‌ల తర్వాత ఆప్‌ ఇప్పుడు గోవాలోనూ గుర్తింపు పొందిన పార్టీగా అవతరించింది. మరో రాష్ట్రంలో గుర్తింపు పొందితే.. అధికారికంగా జాతీయ పార్టీగా ప్రకటిస్తాం. కష్టపడి పని చేసిన వలంటీర్లు ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు. ఆప్‌, దాని భావజాలాన్ని నమ్మిన ప్రజలను కృతజ్ఞతలు.’ అని ట్వీట్‌ చేశారు కేజ్రీవాల్‌. జన్‌లోక్‌పాల్ ఉద్యమం తర్వాత 2012లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అవతరించింది. 2013 ఢిల్లీ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్‌ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్‌ మద్దతు ఉపసంహరించుకోవటం ద్వారా 49 రోజులకే ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధఇంచారు. 2015లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆప్‌. 2020లోనూ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది.

నేషనల్‌ పార్టీగా గుర్తింపు రావాలంటే?
నేషనల్‌ పార్టీగా గుర్తింపు రావాలంటే.. దేశంలోని ఏ రాజకీయ పార్టీ అయిన ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించాలి. లేదా గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు లేదా కనీసం 2 శాతం సీట్లు సాధించాలి. అందులో ఎంపీలు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నిక కావాలి. లేదా నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి.

ఇదీ చదవండి: ఆగస్టు 15 లోపు కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి?

మరిన్ని వార్తలు