జైల్లో కుప్పకూలిన జైన్‌

26 May, 2023 06:18 IST|Sakshi

హుటాహుటిన ఢిల్లీ ఆస్పత్రిలో చేర్పించిన పోలీసులు

ఐసీయూలో సత్యేందర్‌ జైన్‌కు కొనసాగుతున్న చికిత్స

న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై 2022 మే నుంచి తీహార్‌ జైల్లో ఉన్న మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ గురువారం కుప్పకూలిపోయారు. జైల్లో కళ్లు తిరిగిపడిన జైన్‌ను పోలీసులు హుటాహుటిన దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఆస్పత్రిలో చేర్పించారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే లోక్‌నాయక్‌ జయ్‌ప్రకాశ్‌ నారాయణ్‌ ఆస్పత్రి ఐసీయూకి మార్చారని ఆప్‌ వర్గాలు వెల్లడించాయి. గురువారం ఉదయం జైలు బాత్రూమ్‌లో జైన్‌ కాలుజారి పడిపోయారని జైలు అధికారి చెప్పారు. ‘‘కీలక అవయవాలకు గాయాలయ్యాయా అని వెంటనే వైద్యులు పరిశీలించి అంతా సాధారణంగా ఉందని తేల్చారు.

వెనుకవైపు, ఎడమ కాలు, భుజం విపరీతంగా నొప్పి ఉన్నాయని చెప్పడంతో ఆస్పత్రికి తీసుకెళ్లాం’’ అన్నారు. స్నానాలగదిలో కళ్లు తిరిగి పడిపోవడంతో వెన్నెముకకు తీవ్ర గాయమైందని ఆప్‌ తెలిపింది. ‘‘ఢిల్లీ ప్రజలకు మంచి వైద్యం, ఆరోగ్యం అందించాలని చూసిన జైన్‌ను ఒక నియంత ఇలా శిక్షిస్తున్నాడు. దేవుడు అంతా చూస్తున్నాడు. అందరికీ న్యాయం జరుగుతుంది’ అంటూ ఆప్‌ నేత, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ట్వీట్‌చేశారు. జైన్‌ను చెప్పడంతో జైలు అధికారులు సోమవారమే సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చూపించారు. ‘‘జైన మతవిశ్వాసాలను బాగా పాటించే జైన్‌ జైల్లో కేవలం పళ్లు, పచ్చి కూరగాయలు తింటున్నారు. దాంతో 35 కిలోలు తగ్గారు. రాత్రంతా బీఐపీఏపీ మెషీన్‌తో శ్వాస ఇవ్వాలి’’ అని ఆప్‌ తెలిపింది.

మరిన్ని వార్తలు