బీ, ఏబీ బ్లడ్‌ గ్రూపుల వారికే కరోనా ముప్పు ఎక్కువ

11 May, 2021 17:29 IST|Sakshi

బ్లడ్‌ గ్రూపులు, కరోనా : సీఎస్‌ఐఆర్‌ తాజా సర్వే

ఓ  గ్రూపు వారికి రోగ నిరోధక శక్తి ఎక్కువ

ఏబీ, బీ బ్లడ్‌ గ్రూపుల వారిపై వైరస్‌ తీవ్ర ప్రభావం 

సాక్షి,న్యూఢిల్లీ: దేశంలో రెండో దశలో కరోనా మహమ్మారి ప్రకంపనలు కొనసాగుతున్నాయి. అయితే ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అంచనాలను బట్టి ఓ, బీ బడ్‌ గ్రూపుల వారికన్నా ఏ, ఏబీ బడ్‌ గ్రూప్‌ల వారే ఎక్కువగా కరోనా వైరస్‌ బారిన పడుతున్నారని, ఏ, ఏబీ బ్లడ్ గ్రూపులు వారికే కరోనా వైరస్‌ సోకే అవకాశం ఉందని విన్నాం. కానీ తాజాగా  సీఎస్‌ఐఆర్‌ నిర్వహించిన అధ్యయనంలో  మరో కీలక విషయం వెలుగు చూసింది.  'ఓ' గ్రూపు వారితో పోలిస్తే బీ, ఏబీ బ్లడ్‌ గ్రూపుల వారికే వైరస్‌ ఎక్కువ సోకుతోందని తేలింది. ఈ  గ్రూపుల వారిపైనే వైరస్‌ తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.

సీఎస్ఐఆర్ అధ్యయనం
సీఎస్ఐఆర్  పరిశోధనా పత్రం ప్రకారం బీ, ఏబీ బ్లడ్‌ గ్రూపు ఉన్న ప‍్రజలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు.  బీ, ఏబీ బ్లడ్‌ గ్రూపుల వారే కరోనాకు ఎక్కువగా గురవుతున్నారని తెలిపింది. అలాగే ఓ గ్రూపు వారు తక్కువ సెరో-పాజిటివిటీ లేదా ప్రమాదంలో ఉన్నారని ఆగ్రాలోని పాథాలజిస్ట్ డాక్టర్ అశోక్ శర్మ  వెల్లడించారు.  అలాగే దేశవ్యాప్త సెరో సర్వే ప్రకారం శాఖాహారుల కంటే మాంసాహారం తినేవారికే కరోనా సంక్రమించే అవకాశం ఎక్కువ ఉందని తేల్చారు. శాఖాహారుల్లో బలమైన రోగనిరోధక శక్తి ఉంటుంది. వారు తినే శాఖాహార ఆహారంలో అధిక ఫైబర్ కంటెంట్ ఉందని అధ్యయనం పేర్కొంది. హై-ఫైబర్ ఆహారం యాంటీ ఇన్ఫ్లమేటరీ​ అని విశ్వసిస్తాం కనుక ఇది ఇన్ఫెక్షన్ అనంతర సమస్యలను నివారించడంతోపాటు, వైరస్‌నూ నిరోధిస్తోందని ఈ స్టడీ తెలిపింది. దేశవ్యాప్తంగా 10వేల మందితో నిర్వహించిన ఈ అధ్యయనంలో 140 మంది వైద్యులు కూడా ఉన్నారు. అయితే  చాలామంది నిపుణులు ఈ అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. 

విభేదిస్తున్న కొంతమంది నిపుణులు
ఓ బ్లడ్‌ గ్రూపు ఉన్నవారికి రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉందనీ, అంతమాత్రాన వారు కోవిడ్-19 ప్రోటో కాల్‌కు విరుద్ధంగా పవర్తించాలని కాదని పేర్కొన్నారు. ఎందుకంటే వారికి కూడా కరోనావైరస్ సోకుతుందనే విషయాన్ని గుర్తించాలని సీనియర్ వైద్యుడు డాక్టర్ ఎస్.కె. కల్రా తెలిపారు. ఇది కేవలం "నమూనా సర్వే" అని, ఇది పీర్-రివ్యూడ్ సైంటిఫిక్ రీసెర్చ్ పేపర్ కాదని అన్నారు. ఎందుకు వ్యత్యాసం ఉందో పూర్తిగా విశ్లేఫించకుండా, అర్థంచేసుకోకుండా, కొన్నిబ్లడ్‌ గ్రూపులకు మాత్రమే రోగనిరోధక శక్తి ఉందని తేల్చడం చాలా తొందరపాటు అవుతుందని అభిప్రాయపడ్డారు.

ఓ బ్లడ్‌ గ్రూప్‌ (పాజిటివ్‌ లేదా నెగటివ్‌)’ కలిగిన ప్రజలపై కరోనా వైరస్‌ అంతగా ప్రభావం చూపించడం లేదని, బ్రిటిష్‌ కొలంబియా యూనివర్శిటీ, డెన్మార్క్‌లోని ఓడెన్స్‌ యూనివర్శిటీ హాస్పిటల్‌ పరిశోధకులు ఏడాది అక్టోబరులో వేర్వేరుగా జరిపిన రెండు అధ్యయనాల్లో తేల్చారు. వైరస్‌ కారణంగాశరీర అవయవాలు చెడిపోవడం, మత్యువాత పడడం వీరిలో చాలా తక్కువని  వెల్లడించారు. కాగా  గత 24 గంటల్లో 3.29 లక్షలకు పైగా కొత్త  కరోనా కేసులు  నమోదయ్యాయి. మరో 3,876 మరణించారు.  3.56 లక్షలకు పైగా బాధితులు కోలుకున్నారు. రికవరీ రేటు 82.39 శాతంగా ఉంది. అయితే మరణాల రేటు ప్రస్తుతం 1.09 శాతంగా ఉంది. పాజిటివిటీ రేటు ఇప్పటికీ 20 శాతానికి పైనే ఉండటం గమనార్హం.

చదవండి: కరోనా: ప్రముఖ రచయత, నటుడు కన్నుమూత

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు