18 ఏళ్లకే భర్త వదిలేస్తే.. ఐస్‌ క్రీం అమ్మకం నుంచి నేడు ఎస్సై

28 Jun, 2021 10:55 IST|Sakshi
ఎస్సై ఉద్యోగం సాధించిన అని శివ (ఫైల్‌ ఫోటో)

సోషల్‌ మీడియాలో వైరలవుతోన్న కేరళ మహిళ ఎస్సై కథనం

ఆరు నెలల బిడ్డతో రోడ్డున పడ్డా.. చెదరని సంకల్పంతో నేడు ఎస్సైగా

తిరువనంతపురం: యుక్త వయసు వచ్చిందంటే చాలు.. చాలా మంది ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచన అమ్మాయి పెళ్లి గురించే ఉంటుంది. ఆమె ఇష్టానికి, ఆశలకు, ఆశయానికి పెళ్లి పేరిట సంకెళ్లు వేస్తారు. ఇక దురదృష్టం​ కొద్ది కట్టుకున్న వాడు వదిలేస్తే.. కొన్ని చోట్ల కన్నవారు కూడా ఆదరించరు. అలాంటి సందర్భాల్లో చాలా మంది ఆడవారు మరణమే శరణం అనుకుంటారు. కానీ కొందరు మహిళలు మాత్రం ఆత్మస్థైర్యంతో ముందడుగు వేసి.. తాను కన్నీరు పెట్టిన చోటే సగర్వంగా తలెత్తుకుని నిలబతారు.. పది మందికి ఆదర్శంగా నిలుస్తారు. ఈ కోవకు చెందిన వారే కేరళకు చెందిన అని శివ. 18వ ఏట భర్త వదిలేస్తే.. చేతిలో ఆరు నెలల బిడ్డతో రోడ్డున పడ్డ శివ.. నేడు అదే చోట ప్రొబేషనరీ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. ఆ వివరాలు..

కేరళకు చెందిన అని శివ 18వ ఏట డిగ్రీ ఫస్టియర్‌ చదువుతుండగా.. ఆమెకు ఇష్టం లేకపోయిన బలవంతంగా పెళ్లి చేశారు తల్లిదండ్రులు. ఐపీఎస్‌ కావాలనే ఆమె కలకు అక్కడితో శుభం కార్డు పడింది. వైవాహిక జీవితం కూడా సవ్యంగా సాగలేదు. బిడ్డ పుట్టిన ఆరు నెలలకు భర్త ఆమెను వదిలేశాడు. ఆదరించాల్సిన కన్నవారు.. దూరం పెట్టారు. దాంతో తన నానమ్మకు సంబంధించిన చిన్న రేకుల షెడ్డులో బిడ్డతో కలిసి జీవించసాగింది అని శివ.

ఇక బతుకుతెరువు కోసం ఏ పని దొరికినా చేసేది. వర్కాలా శివగిరి ఆశ్రమ ప్రాంతంలో నిమ్మ రసం, ఐస్‌క్రీములు మొదలు హస్తకళలకు చెందిన పలు వ్యాపారాలు చేసింది. కానీ అన్నింట్లో అపజయమే. ఇలా ఉండగా ఓ సారి ఆమెను గమనించిన ఓ వ్యక్తి.. చదువుకోమని సూచించి.. ఆర్థిక సాయం చేశాడు. ఆ తర్వాత ఆ అజ్జాత వ్యక్తి సూచన మేరకు ఎస్సై జాబ్‌కు అప్లై చేసి.. కొలువు సంపాదించింది. 

ఈ క్రమంలో కేరళ పోలీసు డిపార్ట్‌మెంట్‌ ఆమెను ప్రశంసిస్తూ ట్వీట్‌ చేసింది. ‘‘నిజమైన ఆత్మవిశ్వాసానికి, మనో స్థైర్యానికి ప్రతీకగా నిలిచారు అని శివ. 18వ ఏట భర్త ఆమెను రోడ్డున పడేశాడు. కుటుంబం ఆమె గురించి పట్టించుకోలేదు. కానీ ఆమె వీటన్నింటిని తట్టుకుని నేను ఎస్సై ఉద్యోగం సాధించింది’’ అని ప్రశంసిస్తూ ట్వీట్‌ చేయడంతో ఆమె స్టోరి తెగ వైరలయ్యింది.

ఈ సందర్భంగా అని శివ మాట్లాడుతూ.. ‘‘నా గురించి తెలిసి ఎవరెవరో నన్న ప్రశంసిస్తూ మెసేజ్‌లు చేస్తున్నారు. వర్కాలా పోలీస్‌ స్టేషన్‌లో నాకు పోస్టింగ్‌ ఇచ్చారని కొన్ని రోజుల క్రితమే తెలిసింది. ఎక్కడైతే నేను కన్నీరు కార్చానో.. ఎవరి మద్దతు లేకుండా నా బిడ్డ జీవితం కోసం పోరాడానో.. నేడు అక్కడే ఎస్సైగా విధులు నిర్వహిస్తాను అని తలుచుకుంటేనే చాలా గర్వంగా అనిపిస్తుంది. నా భావాలను వ్యక్తం చేయడానికి మాటలు రావడం లేదు’’ అన్నారు. 

చదవండి: స్వయంగా బావిలోకి దిగి శవాన్ని వెలికి తీసిన ఎస్‌ఐ

మరిన్ని వార్తలు