చీప్‌ పబ్లిసిటీ కోసం వెంపర్లాడవద్దు..

16 Dec, 2020 16:22 IST|Sakshi

న్యూఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ రాసిన చివరి పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌’ ప్రచురణ అంశంపై చెలరేగిన వివాదంపై ఆయన తనయుడు, కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ అభిజిత్‌ ముఖర్జీ స్పందించారు. ఈ పుస్తకాన్ని ప్రచురించడంలో తనకేమీ అభ్యంతరం లేదని, అయితే తాను ఆ బుక్‌ను పూర్తిగా చదివిన తర్వాతే పబ్లిష్‌ చేయాలని బుధవారం పునరుద్ఘాటించారు. ఈ మేరకు..  ‘‘కొందరు భావిస్తున్నట్లుగా, మా నాన్న చివరి జ్ఞాపకానికి సంబంధించిన అంశానికి నేనెంత మాత్రం వ్యతిరేకం కాదు. అయితే ఆ పుస్తకంలో ఉన్న కంటెంట్‌ గురించి తెలుసుకోవడం ఒక కొడుకుగా నాకున్న హక్కు. ఒకవేళ నాన్న బతికుండి ఉంటే, పుస్తకం పూర్తైన తర్వాత ఆయన కూడా ఇదే చేసేవారు. ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూసేవారు. గతంలో కూడా అలాగే చేశారు. ఇప్పుడు కూడా నేను అదే చేయాలనుకుంటున్నా.

ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నా. నేను ఆ పుస్తకం చదివేంత వరకు ప్రచురణ ఆపేయండి. చీప్‌ పబ్లిసిటీ కోసం వెంపర్లాడవద్దు’’ అని ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌ పేరిట ప్రణబ్‌ ముఖర్జీ రాసిన రూపా పబ్లికేషన్స్‌ విడుదల చేయనున్నట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. ఇందులో ఆయన సోనియాగాంధీ, మన్మోహన్‌ సింగ్‌పై చేసిన వ్యాఖ్యలు కొన్ని ఇటీవల బయటకి వచ్చాయి.

ఈ క్రమంలో జనవరిలో  బుక్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు పబ్లికేషన్స్‌ ప్రకటించగా.. తాను ఆ పుస్తకం తుది ప్రతుల్ని పూర్తిగా చదివిన తర్వాతే ప్రచురణకు అనుమతినిస్తానని అప్పటి వరకు పుస్తక విడుదలని నిలిపివేయాలని ప్రచురణ కర్తలకి చెప్పినట్టుగా అభిజిత్‌ ముఖర్జీ వెల్లడించగా, ఆయన సోదరి శర్మిష్ట మాత్రం చీప్‌ పబ్లిసిటీ కోసం అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ అంటూ ట్వీట్‌ చేశారు. దీంతో అక్కాతమ్ముళ్ల తలెత్తిన భేదాభిప్రాయాలు చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి ఈ మేరకు స్పందించడం గమనార్హం.(చదవండి: ప్రణబ్‌ పుస్తకం.. ఇంట్లోనే వైరం)

మరిన్ని వార్తలు