ఉన్నత విద్యకి.. ‘ఆమె’ దూరమేనా ?

17 Jun, 2021 15:04 IST|Sakshi

ప్రాథమిక విద్యపై చూపిస్తున్న ఆసక్తి, ఆపై ఆవిరి

గుజరాత్‌లో పరిస్థితులు మరీ దారుణం

మహిళా విద్యలో ఎప్పటిలాగే ముందున్న కేరళ

పర్వాలేదనిపించిన తెలుగు రాష్ట్రాలు

వెల్లడించిన నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే నివేదిక 

వెబ్‌డెస్క్‌ : స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్లు దాటినా దేశమంతటా మహిళలకు ఉన్నత విద్య అందని ద్రాక్షే అవుతోంది.  బాలికలకు ప్రాథమిక విద్య అందివ్వడంలో తల్లిదండ్రులు చూపిస్తున్న శ్రద్ధ ఉన్నత విద్య దగ్గరికి వచ్చే సరికి తగ్గిపోతుంది. ముఖ్యంగా ఉన్నత విద్యకు దూరమవుతున్న అమ్మాయిల శాతం ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటోంది. ఇటీవల నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌-5) జారీ ఫలితాలు ఈ విషయాలను వెల్లడిస్తున్నాయి. 

ప్రాథమిక విద్యలో భేష్‌
దేశంలో ఉన్న 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో సేకరించిన డేటా ఆధారంగా ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్‌ ఈ వివరాలు ప్రకటించింది. బాల్య దశలో అమ్మాయిలను పాఠశాలకు పంపేందుకు దాదాపు దేశమంతటా ఒకే రకమైన ఉత్సాహాం కనిపిస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో బాలిలకు 90 శాతం ప్రాథమిక విద్య చదివేందుకు స్కూళ్లకు వెళ్తున్నారు. బీహార్‌లో అతి తక్కువగా 90 శాతం మంది బాలికలు ప్రాథమిక విద్యాభ్యాసం చేస్తుంటే కేరళ, గోవా రాష్ట్రాల్లో ఇంచుమించు వందశాతం మంది బాలికలకు  ప్రాథమిక విద్య అందుతోంది. 

అందని ద్రాక్షే
ప్రాథమిక విద్యలో 90 శాతానికి తగ్గకుండా అమ్మాయిలను స్కూళ్లకి పంపిస్తున్న తల్లిదండ్రులు టెన్త్‌, ఇంటర్‌ల తర్వాత ఉన్నత విద్య అందించేందుకు ఇంకా తటపటాయిస్తూనే ఉన్నారు. గుజరాత్‌, అసోం, పశ్చిమబెంగాల్‌, త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ ప్రాథమిక విద్యతో పోల్చితే కాలేజీలకు వెళ్తున్న అమ్మాయిల శాతం దారుణంగా పడిపోయింది. ముఖ్యంగా గుజరాత్‌లో పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ఇక్కడ 96.4 శాతం మంది అమ్మాయిలు ప్రాథమిక విద్యను అభ్యసిస్తే.. ఉన్నత విద్య దగ్గరికి వచ్చే సరికి కేవలం  45 శాతం అమ్మాయిలే కాలేజీ మెట్లు ఎక్కుతున్నారు. ఇదే తరహా పరిస్థితి పశ్చిమ బెంగాల్‌తో పాటు ఈశాన్య రాష్ట్రాలైన అసోం, త్రిపుర, నాగాలాండ్‌లలో కూడా నెలకొంది.

కేరళ భేష్‌
అన్నింటా ముందుటే కేరళా మహిళ అక్షరాస్యత విషయంలోనూ అదే ధోరణి కనబరిచింది. ఇక్కడ ప్రాథమిక విద్య 99.5 శాతం మంది బాలికలకు అందుతోంటే ఇంటర్‌ వరకు వచ్చే సరికి కొంచెం తగ్గి 98.2 శాతానికి చేరుకుంది. ఈ రాష్ట్రంలో 90.8 శాతం మంది అమ్మాయిలు డిగ్రీ ఆపై చదువులకు వెళ్లి ఉన్నతవిద్యావంతులు అవుతున్నారు. ఇంచుమించు ఇవే తరహా ఫలితాలు గోవా కూడా కనబరిచింది. పెద్ద రాష్ట్రాలతో పోల్చితే జమ్ము, కశ్మీర్‌, సిక్కం రాష్ట్రాలు కూడా మహిళలకు ఉన్నత విద్య అందివ్వడంలో ముందున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో
మహిళలకు ఉన్నత విద్యను అందివ్వడంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు పర్వాలేదనిపించాయి. తెలంగాణలో 98.6 శాతం మంది బాలికలు ప్రాథమిక విద్యలో చేరుతుండగా ఉన్నత విద్య దగ్గరికి వచ్చే సరికి 76.6 శాతం మంది మిగులుతున్నారు. అంటే 22 శాతం మంది ఉన్నత విద్యకు దూరం అవుతున్నారు. ఇక ఏపీలో ప్రాథమిక విద్యలో 99.1 శాతం మంది జాయిన్‌ అవుతుండగా ఇంటర్‌, డిగ్రీ దగ్గరికి వచ్చే సరికి 70.2 శాతం మంది మిగులుతున్నారు. ఇక్కడ దాదాపు 30 శాతం మంది ఉన్నత విద్య వరకు రాకుండానే డ్రాప్‌ అవుతున్నారు. 
 

మరిన్ని వార్తలు