ప్రతీకారం కాదు, అంతా చట్ట ప్రకారమే!!

4 Nov, 2020 12:19 IST|Sakshi

అర్నాబ్‌ అరెస్టుతో రగిలిన వివాదం

బీజేపీ, శివసేన మధ్య మళ్లీ రాజుకున్న మాటల యుద్ధం

సాక్షి, ముంబై : దివంగత  బాలీవుడు నటుడు సుశాంత్‌సింగ్‌ ఆత్మహత్యతో రగిలిన వివాదం, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి అనూహ్య అరెస్టు తరువాత మరోసారి రాజుకుంది. బీజేపీ, శివసేన మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. తాజాగా  అర్నాబ్ గోస్వామి అరెస్టుపై వస్తున్న విమర్శలపై  శివసేన నాయకుడు సంజయ్ రౌత్ స్పందించారు. తమ హయాంలో ప్రతీకారం అనే సమస్యే ఉండదనీ, చట్ట ప్రకారమే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఈ క్రమంలో అర్నాబ్‌ అరెస్టు చట్ట ప్రకారమే చోటు చేసుకుందని వివరించారు. తగిన ఆధారాలుంటే ఎవరిపైనైనా పోలీసులు చర‍్యలు తీసుకుంటారన్నారు. అంతేకాదు మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే  ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకునే ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆయన స్పష్టం చేశారు. (రిపబ్లిక్ టీవీ చీఫ్ అర్నాబ్‌ గోస్వామి అరెస్టు)

మరోవైపు  గతంలో మూసివేసిన ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్ ఆత్మహత్యకు సంబంధించిన 2018 కేసును విషయంలోనే అర్నాబ్ గోస్వామిని అరెస్టుచేశామని మహారాష్ట్ర హోంమంత్రి  ధృవీకరించారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసుదర్యాప్తు,  టీఆర్‌పీ కుంభకోణంపై మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు, అర్నాబ్‌పై రెండేళ్ల కేసును తిరిగతోడారన్న ఆరోపణల నేపథ్యంలో సంజయ్‌  ఇలా స్పందించారు. ముఖ్యంగా మహారాష్ట్ర పోలీసుల చర్యను పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ కేంద్ర మంత్రి ప్రకాష్ జవడేకర్ విమర్శలకు ఆయన కౌంటర్‌ ఇచ్చారు.   అర్నాబ్‌ అరెస్టు సిగ్గు  చేటని బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా వ్యాఖ్యానించారు. అటు మరో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూడా అర్నాబ్ గోస్వామికి మద్దతుగా నిలిచారు. అర్నాబ్‌ గోస్వామి అంటే ఇష్టం ఉన్నా లేకున్నా మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న ఫాసిస్టు దాడికి వ్యతిరేకంగా నిలబడాలన్నారు.  మౌనంగా ఉంటే అణచివేతకు మద్దతిచ్చినట్టేననిఆమె ట్వీట్‌ చేశారు. అటు బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ కూడా సేన ప్రభుత్వంపై మండిపడింది. (అర్నాబ్‌ అరెస్టు, పత్రికా స్వేచ్ఛపై దాడి: కేంద్రమంత్రి)

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు