సోనూసూద్‌కి ఐరాస అవార్డ్‌

30 Sep, 2020 04:04 IST|Sakshi

ఈ గౌరవం పొందిన తొలి భారతీయ నటుడు

ఐక్యరాజ్యసమితి: కరోనా సంక్షోభ కాలంలో బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ దేశ ప్రజలకు చేస్తోన్న సామాజిక సేవను గుర్తించి, ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్‌ నేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (యూఎన్‌డీపీ).. ప్రతిష్టాత్మక ఎస్‌డీజీ స్పెషల్‌ హ్యుమాని టేరియన్‌ యాక్షన్‌ అవార్డుతో సత్కరించింది. సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా సోనూసూద్‌కి ఈ అవార్డును ప్రదానం చేశారు. కరోనా సంక్షోభం సినీ పరిశ్రమలోని నిజమైన హీరోలను తెరపైకి తెచ్చింది. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బందితో పాటు బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ లాంటి మానవతా వాదులను సమాజానికి పరిచయం చేసింది.

ఎన్నో సినిమాల్లో విలన్‌ పాత్రలతో సుపరిచితమైన సోనూసూద్‌ అనేక మంది వలస కార్మికులను తమ గమ్యస్థానాలకు చేర్చి, విదేశాల్లోని విద్యార్థుల కోసం ప్రత్యేకంగా విమానాన్ని వేసి, కోవిడ్‌ సంక్షోభంతో ఆపదలో ఉన్న అనేక మందిని ఆదుకొని ప్రజల మనస్సుల్లో నిఖార్సయిన హీరోగా నిలిచిపోయారు. ఆయన చేసిన కృషిని సామాజిక మాధ్యమాల్లో ఎందరో అభినందించారు. సోనూసూద్‌ ఈ అవార్డు తనకు అత్యంత అరుదైన గౌరవమని, ఎంతో ప్రత్యేకమని, తన కృతజ్ఞతలను తెలిపారు. తనచుట్టూ కష్టాల్లో కొట్టుమిట్టాడుతోన్న ప్రజలకు నిస్వార్థంగా, తనకు తోచిన సాయం చేసినట్లు సోనూసూద్‌ అన్నారు.

2030 నాటికి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవడానికి యూఎన్‌డీపీ చేస్తోన్న కృషికి తన మద్దతు ఉంటుందని సోనూసూద్‌ తెలిపారు. వలస కార్మికులు, విద్యార్థులు, ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంటోన్న వారిని రక్షించడంలో సోనూసూద్‌ ఆపద్బాం ధవుడయ్యారు. అనేక మంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరయ్యేందుకు స్మార్ట్‌ఫోన్‌లు కొనివ్వడం, సిగ్నల్‌ లేని ప్రాంతాల్లో మొబైల్‌ టవర్స్‌ని ఏర్పాటు చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలను సోనూ చేపట్టారు. మానవతా దృక్పథంతో చేసిన సేవలను ఐరాస గుర్తించిన వారిలో సోనూసూద్‌ తొలి భారతీయ నటుడు. యూఎన్‌డీపీ పేదరిక నిర్మూలన కోసం 170కి పైగా దేశాల్లో పనిచేస్తోంది. 

మరిన్ని వార్తలు