Recruitment Scam: డబ్బంతా మంత్రిదే.. నా ఇంటికి వారానికోసారి వచ్చేవారు: నటి అర్పిత

27 Jul, 2022 13:52 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో ఉద్యోగ నియామకాల స్కామ్‌ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈడీ విచారణలో నటి అర్పితా ముఖర్జీ.. పార్థా ఛటర్జీ గురించి కీలక విషయాలు తెలిపారు. అయితే, విద్యాశాఖ మంత్రి పార్థా ఛటర్జీ.. తనకు 2016 నుంచి పరిచయం ఉన్నట్టు అర్పిత తెలిపారు.

ఓ బెంగాలీ న‌టుడు త‌న‌ను మంత్రికి పరిచయం చేశారని చెప్పుకొచ్చారు. తన ఇంట్లో దొరికిన రూ. 21కోట్ల డబ్బు పార్థా ఛటర్జీదేనని తెలిపారు. ఈ క్రమంలోనే పార్ధా త‌న ఇంట్లో ఉన్న ఓ రూమ్‌లోనే డ‌బ్బును దాచాడ‌ని పేర్కొంది. త‌న ఇంటితో పాటు మ‌రో మ‌హిళ ఇంటిని కూడా ఆయన మినీ బ్యాంక్‌లా వాడుకున్న‌ట్లు ఆరోపించారు. తన ఇంట్లోని రూమ్‌కు ఫుల్‌ సెక్యూర్టీగా పార్థా మనుషులే ఉండేవారని చెప్పింది. వారు మాత్రమే రూమ్‌ లోపలి వెళ్లి వచ్చేవారని స్పష్టం చేసింది.

కాగా, తన ఇంటికి పార్థా ఛటర్టీ.. వారంలో ఒక్కరోజు లేదా 10 రోజులకు ఒకసారి వచ్చి వెళ్లే వారని తెలిపారు. వచ్చిన తర్వాత రూమ్‌లోకి వెళ్లి డబ్బులు చెక్‌ చేసుకునే వారిని వెల్లడించింది. అయితే, ఆ డబ్బంతా.. కాలేజీల విషయంలోనే లంచాల రూపంలో వచ్చిందని స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా.. వీరిద్దరూ ఆగ‌స్టు 3వ తేదీ వ‌ర‌కు ఈడీ క‌స్ట‌డీలో ఉండ‌నున్నారు. దీంతో విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

ఇది కూడా చదవండి: వాళ్లకు పూలు.. మాకు బుల్డోజర్లా?: యోగి సర్కార్‌పై ఒవైసీ కామెంట్లు

మరిన్ని వార్తలు