కమల్‌ సీఎం కావడం ఖాయం..

18 Mar, 2021 05:05 IST|Sakshi

సుపరిపాలనను ఆశించి మా కూటమిని గెలిపిస్తారు 

‘సాక్షి’తో సమత్తువ మక్కల్‌ కట్చి అగ్రనేత, నటి రాధిక ధీమా

సాక్షి, చెన్నై: తమిళనాడు ప్రజలు మార్పు కోరుకుంటున్నట్లు సర్వేలో స్పష్టమైంది, సుపరిపాలనే లక్ష్యంగా అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగిన ఐజేకే కూటమి గెలుపు తథ్యం, కమల్‌హాసన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని సమత్తువ మక్కల్‌ కట్చి (ఎస్‌ఎంకే) అగ్రనేత, నటి రాధిక ధీమా వ్యక్తం చేశారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ సారి కొత్త కూటమి. విద్య, వైద్యరంగంలో ప్రసిద్ధులైన ఇండియా జన నాయక కట్చి అధ్యక్షులు రవి పచ్చముత్తు, మక్కల్‌ నీది మయ్యం అధ్యక్షులు కమల్‌హసన్, నా భర్త, సమత్తువ మక్కల్‌ కట్చి అధినేత శరత్‌కుమార్‌లతో కూటమిగా ఏర్పడ్డాం.

ఎప్పుడూ లీడింగ్‌ పార్టీలకే ఓటు వేసిన ప్రజలు ఒక మార్పు రావాలని ఆశిస్తున్నారు. ఇవ్వాలని మేము ఆశిస్తున్నాం. మాది ఒక బలమైన కూటమి. ప్రజలు ఒక మార్పు రావాలని కోరుకునే క్రమంలో విద్యావంతులు, మేధావులు ఉంటారు. వారంతా ఏకగ్రీవంగా మార్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఇది చాలా అరుదైన ప్రగతిశీల ఆలోచన. గుడ్‌ గవర్నెస్‌ కోసం మాకు ఓటు వేయాలి. పరిపాలనలో ఒక మార్పు తీసుకొస్తామని ప్రజలకు ప్రమాణం చేస్తున్నాం. ఎస్‌ఎంకే మేనిఫెస్టో, ఎంఎన్‌ఎం మేనిఫెస్టోలు తరచి చూస్తే సుపపరిపాలనకు, వాస్తవికతకు దగ్గరగా అద్దం పడుతున్నాయి. భావితరాల కోసం కమల్‌హాసన్‌ మంచి చేస్తారనే నమ్మకం ప్రజలందరికీ ఉంది. అందుకే కమల్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని విశ్వసిస్తున్నట్లు రాధిక తెలిపారు. 

>
మరిన్ని వార్తలు