రష్మిక డీప్‌ ఫేక్‌ వీడియో: గాయని చిన్మయి శ్రీపాద ఫైర్‌

6 Nov, 2023 20:06 IST|Sakshi

ఇది చాలా భయంకర ఆయుధంగా మారుతోంది: చిన్మయి శ్రీపాద

తక్షణమే దేశవ్యాప్త అవగాహన ప్రచారం మొదలు కావాలి

నటి రష్మిక్‌ డీప్‌ ఫేక్‌ వీడియో ఉదంతం, ఫేక్‌ న్యూస్‌, తప్పుడు  వీడియోలు, ఫోటోలపై పెద్ద చర్చకు దారి తీస్తోంది. అభ్యంతరకరంగా మార్ప్‌ చేసిన రష్మిక వీడియో నెట్టింట వైరల్‌ కావడంతో ఇప్పటికే  పలువురు సెలబ్రిటీలు,  నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.  అంతేకాదు స్వయంగా బిగ్‌బీ దీనిపై ట్విటర్‌ వేదికగా ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు సాక్షాత్తూ ​కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ కూడా స్పందించారు. ఇది చాలా ప్రమాదకరంగా పరిణ మిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రమంత్రి సోషల్‌ మీడియా సంస్థలకు  కీలక హెచ్చరికలు కూడా జారీ చేశారు.

తాజాగా ప్రముఖ గాయని, మీటూ ఉద్యమానికి భారీ మద్దతిచ్చిన చిన్మయి  శ్రీపాద కూడా ఎక్స్‌ (ట్విటర్‌)లో స్పందించారు. డీప్‌ ఫేక్ వీడియో రష్మిక ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ చూశాను. ఈ వీడియోతో నిజంగా ఆమె కలవరపడుతునట్టు కనిపిస్తోందన్నారు. ప్రతిరోజూ మహిళల శరీరాలు దోపిడీకి గురవుతున్న దేశంలో, అమ్మాయిలను వేధించేందుకు  ఒక సాధనంగా మారుతోంది... వారిని భయపెట్టేందుకు, బ్లాక్‌మెయిల్‌ చేసేందుకు, లైంగికంగా దాడి చేసేందుకు కూడా  తీవ్రమైన ఆయుధంగా డీప్‌ ఫేక్స్‌ మారబోతోందన్నారు.

అలాగే అమ్మాయిల గౌరవానికి ప్రమాదంగా మారిన ఏఐ, డీప్‌ ఫేక్‌ లాంటి వాటిపై అవగాహన లేని చిన్న గ్రామం లేదా పట్టణాల్లోని కుటుంబాల పరిస్థితి ఏంటి? అంటూ చిన్మయి ప్రశ్నించారు.  ఈ సందర్భంగా జైలర్‌ సినిమాలోని సెన్సేషనల్‌  ‘నువ్వు కావాలయ్యా’ పాట విడుదల తరువాత వచ్చిన ఒకప్పటి  హీరోయిన్‌ సిమ్రన్‌ ఫేక్‌ వీడియోను  ప్రస్తావించారు.  ఏఐ మాయ అంటూ సిమ్రన్‌  ఇన్‌స్టాలో షేర్‌ చేసేదాకా దాదాపు ఎవ్వరికీ దీని గురించి తెలియదు.. అంటూ ఈ ఫేర్‌ వీడియో గురించి చిన్నయి గుర్తు చేశారు. 

అంతేకాదు డీప్‌ఫేక్‌ల ప్రమాదం, సైబర్‌ నేరాలపై ఫిర్యాదు చేసేలా సాధారణ ప్రజలకు , బాలికలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్త ప్రచారాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మార్పింగ్‌ ఫోటోలతో అమ్మాయిలను, మహిళా రుణ గ్రహీతలను వేధిస్తున్న లోన్‌ యాప్‌ల అరాచకాలను ఆమె ప్రస్తావించారు. ఎంతో కొంత పరిజ్ఞానం, శిక్షణ ఉంటే తప్ప డీప్‌ ఫేక్‌ను సాధారణ ప్రజలు గుర్తించడం కష్టం అంటూ తప్పుడు కథనాలపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను మరోసారి నొక్కి చెప్పారు.

A post shared by Simran Rishi Bagga (@simranrishibagga)

మరిన్ని వార్తలు