కోవిడ్‌ వ్యాక్సిన్‌: రూ. 80 వేల కోట్లు ఉన్నాయా?!

26 Sep, 2020 17:57 IST|Sakshi

సీరం ఇన్‌స్టిట్యూట్‌ సీఈఓ ఆదార్‌ పూణావాల

ముంబై: మహమ్మారి కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రపంచమంతా వ్యాక్సిన్‌ కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. మానవాళి మనుగడకు సవాలు విసురుతున్న కోవిడ్‌-19కు చెక్‌ పెట్టే దిశగా ఇప్పటికే పలు ఫార్మా దిగ్గజాలు టీకా రూపకల్పనలో మునిగిపోయాయి. ఈ క్రమంలో స్పుత్నిక్‌-వీ పేరిట​ కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేయగా, ఆస్ట్రాజెనెకా, మోడర్నా తదితర కంపెనీల వ్యాక్సిన్లు మూడో దశ క్లినికల్‌ పరీక్షలకు చేరుకున్నాయి. అన్నీ సజావుగా సాగితే ఈ ఏడాది చివర్లోగా టీకా విడుదల గురించి ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోవిడ్‌ ప్రభావిత దేశాల్లో ఒకటైన భారత్‌.. వ్యాక్సిన్‌ కొనుగోలు, పంపిణీ మార్గదర్శకాలు తదితర విషయాల్లో ఎంత వరకు సన్నద్ధంగా ఉందన్న అంశంపై సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ అదార్ పూణావాల కీలక వ్యాఖ్యలు చేశారు. (చదవండి: మార్కెట్లోకి రష్యా వ్యాక్సిన్‌)

ఈ మేరకు.. ‘‘వచ్చే ఏడాది కాలానికి గానూ 80 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉందా? ఎందుకంటే, వాక్సిన్‌ కొనుగోలు చేసేందుకు, దేశంలోని ప్రతీ వ్యక్తికి దానిని పంచేందుకు ఆరోగ్య శాఖ ఈ మొత్తం అవసరం పడుతుంది. మనం తర్వాత ఎదుర్కోబోయే అతిపెద్ద సవాలు ఇదే’’అని ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. దేశీయ, విదేశీ ఫార్మా కంపెనీలను సంప్రదించి టీకాను కొనుగోలు చేసే అంశంలో ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాల్సిన ఆవశ్యకతను వివరించేందుకే తాను ఈ ప్రశ్న అడిగినట్లు పూణావాల పేర్కొన్నారు.

కాగా కరోనా వైరస్ నిరోధక వ్యాక్సిన్‌ రూపకల్పనలో భాగంగా ఆక్స్‌ఫర్డ్‌  యూనివర్సిటీ- ఆస్ట్రాజెనెకాతో సీరం ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. వాక్సిన్‌ ఉత్పత్తి, సరఫరా బాధ్యతలు తీసుకుంది. ఈ క్రమంలో జూలై నెలలో పూణావాల మాట్లాడుతూ.. టీకా ధర వేయి రూపాయల వరకు ఉంటుందని వెల్లడించారు. అంతేగాక ప్రస్తుత పరిస్థితుల్లో చాలా వరకు ప్రభుత్వాలే ఉచితంగా వ్యాక్సిన్‌ అందించే అవకాశాలు ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా..  భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 59 లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు నమోదు కాగా, 1,089 మరణాలు సంభవించాయి. 

>
మరిన్ని వార్తలు