స్టూడెంట్‌ వీసాలపై అమెరికన్‌ ఎంబసీ కీలక ప్రకటన

18 Jun, 2021 02:48 IST|Sakshi

జూలైలో అదనపు అపాయింట్‌మెంట్లు

సాక్షి, హైదరాబాద్‌: స్టూడెంట్‌ వీసాలపై దిగులు చెందవద్దని, జూలైలో అదనపు అపాయింట్‌మెంట్లు ఇస్తామని అమెరికన్‌ ఎంబసీ ప్రకటించింది. కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో అమెరికన్‌ ఎంబసీ జూన్‌ 14 నుంచి స్టూడెంట్‌ వీసాల అపాయింట్‌మెంట్లకు దరఖాస్తులు తీసుకుంటున్న సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమెరికా లోని పలు యూనివర్సిటీల్లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా ఒక్కసారిగా వెబ్‌సైట్‌లో లాగిన్‌ అవుతున్నారు. ఫలితంగా పలుమార్లు సైట్‌ క్రాష్‌ అవుతోంది. అదే సమయంలో పదే పదే రిఫ్రెష్‌ కొట్టడంతో చాలామంది ఖాతాలు ‘లాక్‌’ అయిపోయాయి. దీంతో 72 గంటలపాటు ఆ ఖాతాలు స్తంభించిపోతున్నాయి. చాలా మంది తమ ఖాతాను ‘అన్‌లాక్‌’ చేయాలని ఎంబసీకి విన్నవిస్తున్నారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకున్న అమెరికన్‌ ఎంబసీ.. అపాయింట్‌మెంట్ల విషయంలో ఆందోళన చెందవద్దని, జూలైలో మరిన్ని అపాయింట్‌మెంట్లు ఇస్తామని ప్రకటిస్తూ గురువారం ట్వీట్‌ చేసింది.

టీకా గురించి వర్సిటీని అడగండి
అమెరికాలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులంతా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం)లో టీకా వేయించుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇలాంటి వారంతా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌ వేసుకోవడం కన్నా.. అడ్మిషన్‌ పొందిన వర్సిటీ సూచనల ప్రకారం నడుచుకుంటే మేలని ఎంబసీ వర్గాలు వెల్లడించాయి. అందుకోసం వారిని సంప్రదించాలని స్పష్టంచేశాయి. ఎందుకంటే కొన్ని వర్సిటీలు తాము సూచించిన వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేసుకోవాలని నిబంధనను పక్కాగా అమలుచేస్తున్నాయి. సమాచార లోపం కారణంగా తీరా ఇక్కడ వ్యాక్సిన్‌ వేసుకున్నా కూడా.. అక్కడ మరోసారి వేసుకోవాల్సి వస్తుంది. అందుకే, వర్సిటీ నిబంధనల మేరకు నడుచుకోవాలని ఎంబసీ వర్గాలు స్పష్టంచేశాయి.  

మరిన్ని వార్తలు