ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అదేశ్‌ గుప్తా రాజీనామా

11 Dec, 2022 13:45 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇటీవలే జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(ఎంసీడీ) ఎన్నికల్లో అధికారంలో ఉన్న బీజేపీ పరాజయం పాలైంది. 15 ఏళ్ల రికార్డును తిరగరాస్తూ ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో బీజేపీ పరాజయంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు ఢిల్లీ బీజేపీ చీఫ్‌ అదేశ్‌ గుప్తా. ఓటమికి బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పారు. అదేశ్‌ గుప్తా రాజీనామాకు బీజేపీ అధిష్ఠానం ఆమోదం తెలిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

ప్రస్తుతం ఢిల్లీ బీజేపీ ఉపాధ్యాక్షుడిగా ఉన్న వీరేంద్ర సచ్‌దేవను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా నియమించింది పార్టీ. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు ఆయన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారని తెలిపింది. బీజేపీ ఢిల్లీ యూనిట్‌ చీఫ్‌గా 2020 జూన్‌లో నియామకమయ్యారు అదేశ్‌ గుప్తా. ఎంసీడీ ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచన మేరకే అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.  

ఆప్‌ ఘన విజయం..
హస్తినలో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెర దించుతూ ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ ఘన విజయం సాధించింది. మొత్తం 250 వార్డుల్లో మెజారిటీకి 126 సీట్లు కావాల్సి ఉండగా.. కేజ్రీవాల్‌ పార్టీకి 134 స్థానాలు వచ్చాయి. బీజేపీ 104 సీట్లతో ఆగిపోయింది. మెజారిటీ సాధించకపోయినప్పటికీ మేయర్‌ ఎన్నికకు బీజేపీ పోటీ పడతుందని వాదనలు వినిపించాయి. అయితే ఆ వాదనలను గత శుక్రవారం కొట్టి పారేశారు అదేశ్‌ గుప్తా. మేయర్‌ పదవి ఆప్‌ చేపడుతుందని, బీజేపీ బలమైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఢిల్లీపై ఆప్‌ జెండా 

మరిన్ని వార్తలు