వేరే పార్టీలో చేరండి..

18 Nov, 2020 15:18 IST|Sakshi

కపిల్‌ సిబల్‌కు అధిర్‌ రంజన్‌ సలహా

పార్టీని దెబ్బ తీస్తున్నారని మండిపాటు

న్యూఢిల్లీ: సీనియర్‌ నాయకుడు కపిల్‌ సిబల్ మాటలు కాంగ్రెస్‌ పార్టీలో మంటలు రేపుతున్నాయి. పార్టీకి పూర్వవైభవం రావాలంటే నాయకత్వ మార్పు అవసరమన్న సిబల్‌పై లోక్‌సభ కాంగ్రెస్‌ పక్షనేత అధిర్‌ రంజన్‌ చౌదరి ఘాటు వ్యాఖ్యలు చేశారు. సిబల్‌కు అంత ప్రగతిశీల భావాలు ఉంటే కాంగ్రెస్‌ పార్టీని వీడి పోవచ్చని, లేదంటే వేరే పార్టీలో చేరవచ్చని సూచించారు. పార్టీలో ఉంటూ కాంగ్రెస్‌కు వెన్నుపోటు పొడుస్తున్నారని, విశ్వసనీయతను దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. సోనియా గాంధీ, రాహూల్‌ గాంధీ సీనియర్లకు స్వేచ్ఛగా అభిప్రాయాలు చెప్పే అవకాశం ఇచ్చారని, అయినప్పటికి బహిరంగంగా చెప్పటం మంచి సాంప్రదాయం కాదని హితవు పలికారు. సరైన వేదికపై తమ సూచనలు చెప్పే అవకాశం ఉన్నప్పటికీ పార్టీని ప్రజల్లో చులకన అయ్యేలా వ్యవహరిస్తున్నారని అన్నారు.

బిహార్ ఎన్నికల సమయంలో ఈ నాయకులు ఎక్కడ ఉన్నారని చౌదరి ప్రశ్నించారు. "అటువంటి నాయకులకు కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించడం పట్ల అంత తపన ఉంటే, వారు తమ సామర్థ్యాన్ని నిరూపించుకోవాలి. బిహార్ ఎన్నికల సందర్భంగా వారు పార్టీ గెలుపు కోసం పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారా" అని ఆయన అడిగారు. సోమవారం, కపిల్ సిబల్ ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, కాంగ్రెస్ క్షీణించిందని, ఆత్మపరిశీలన చేసుకునే సమయం సైతం లేదని సొంత పార్టీపై విమర్శలు సంధించడం తెలిసిందే. (చదవండి: కాంగ్రెస్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా గుర్తించడం లేదు)

మరిన్ని వార్తలు