హోలీ విషాదం: కల్తీ మద్యానికి ఆరుగురి మృతి

31 Mar, 2021 17:20 IST|Sakshi

పాట్నా: కల్తీ మద్యం కాటుకు బిహార్‌లో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిశాయి. కల్తీ మద్యం తాగి కొందరు అపస్మారక స్థితికి చేరుకున్నారు. వారిలో 24 గంటల్లో ఆరుగురి పరిస్థితి విషమించి మృతిచెందారు. హోలీ రోజు సరదాగా మద్యం తాగగా.. వారి ప్రాణం మీదకు వచ్చింది. ఈ ఘటనలు నవాడ జిల్లా ఖరిడి బిఘా, గుండాపూర్‌ప్రాంతంలో చోటుచేసుకున్నాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..

మార్చి 29న హోలీ పండుగ సందర్భంగా వేర్వేరు ప్రాంతాలకు చెందిన రామ్‌దేవ్‌ యాదవ్‌, అజయ్‌ యాదవ్‌, దినేశ్‌, శైలేంద్ర యాదవ్‌, లోహ సింగ్‌, గోపాల్‌ కుమార్‌ వేర్వేరుగా మద్యం కొన్నారు. పండుగ ఆనందంలో వారు ఇతరులతో కలిసి మద్యం సేవించారు. అయితే సేవించిన అనంతరం వారి కళ్లు తిరిగాయి. స్పృహ కోల్పోయి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఈ పరిస్థితిని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రులకు తరలించారు. ఈ విధంగా ఒకేరోజు ఆరు మందికి కావడంతో స్థానికంగా కలకలం రేపింది. ఆ దుకాణంలో మద్యం తీసుకున్న వారందరికీ ఆ విధంగా అయ్యిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు బిగుసరాయి ప్రాంతంలో కూడా ఇద్దరు కల్తీ మద్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. 

మద్యపానం నిషేధం విధించిన రాష్ట్రంలో ఏవిధంగా మద్యం ఏరులై పారుతోందని ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ప్రశ్నించింది. కల్తీ మద్యం తాగి ప్రజలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే మృతుల కుటుంబాలకు పరిహారం అందించాలని డిమాండ్‌ చేసింది. వెంటనే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ ఘటనపై మంత్రి శ్రవణ్‌ కుమార్‌ స్పందించారు. ఈ ఘటనపై విచారణ చేస్తున్నామని, ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాని తెలిపారు. 

మరిన్ని వార్తలు