500 జరిమానా‌.. 10 లక్షల పరిహారం

18 Sep, 2020 10:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

హైకోర్టును ఆశ్రయించిన న్యాయవాది

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్‌ విజృంభిస్తున్న తరుణంలో ప్రజలంతా కేంద్ర ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాలను పాటించాలని అధికారులు ఆదేశిస్తున్నారు. ముఖ్యంగా బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చినప్పుడు, ప్రయాణం చేసే సమయంలో తప్పనిసరిగా భౌతిక దూరంతో పాటు ముఖానికి మాస్క్‌ ధరించాలని చెబుతున్నారు. ఈ నిబంధనలు పాటించని వారికి జరిమానా సైతం విధిస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోని ఓ న్యాయవాదికి స్థానిక పోలీసు అధికారులు ఫైన్‌ వేశారు. బహిరంగ ప్రదేశంలో మాస్క్‌ లేకుండా కారు డ్రైవింగ్‌ చేస్తున్నాడని రూ. 500 జరిమానా విధించారు. అయితే అధికారుల తీరుపై న్యాయవాది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. (రష్యా వ్యాక్సిన్‌తో సైడ్‌ ఎఫెక్ట్స్‌)

దీనిపై న్యాయవాది ఢిల్లీ హైకోర్టును సైతం ఆశ్రయించారు. పోలీసు అధికారులు చట్టాన్ని అతిక్రమించి తనకు జరిమానా విధించారని, దానికి గాను పదిలక్షల రూపాయల నష్టపరిహారం కట్టించాలని కోర్టులో దావా వేశారు. అతని వాదన ప్రకారం.. తన వ్యక్తిగత కారులో సింగిల్‌గా  ప్రయాణం చేస్తున్నా అని, ఆ సమయంలో మాస్క్‌ అవసరం లేదని కేంద్రం జారీచేసిన మార్గదర్శకాల్లో ఉన్నట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రజల మధ్యకు వచ్చిన సమయంలో తాను ఖచ్చితంగా మాస్క్‌ ధరిస్తున్నా అని, ఒంటరిగా ఉన్న సమయంలోనే వాడటంలేదని తెలిపారు. కోవిడ్‌ నిబంధనాలు పాటిస్తున్నా.. అన్యాయంగా తనను వేధింపులకు గురిచేశారని, తనతో ఫైన్‌ కట్టించారని తన పిటిషన్‌లో న్యాయవాది పేర్కొన్నారు. (వర్క్‌ ఫ్రం హోమ్‌.. రియాలిటీ ఇదే)

అంతేకాకుండా పోలీసులు తీరు తన పరువుకు భంగం కలిగేలా ఉందని, మానసిన ఒత్తిడికి గురిచేశారని ఆరోపించారు. ఒంటరిగా ఉన్న సమయంలో మాస్క్‌ ధరించకపోవడం ఇతరులకు ఏ విధంగానూ హానికరం కాదన్నారు. వారి తీరును తప్పుబడుతూ రూ.10 లక్షల నష్టపరిహారం కట్టించే విధంగా ఢిల్లీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇ‍వ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. దీనిపై జస్టిస్‌ నవీన్‌ చావ్లా సింగిల్‌ బెంచ్‌ ధర్మాసనం నవంబర్‌ 18న కోర్టు విచారణ జరుపనుంది.

>
మరిన్ని వార్తలు