అఫ్గాన్‌ ఉగ్రవాదుల అడ్డా కాకూడదు

11 Nov, 2021 05:28 IST|Sakshi
సదస్సు తర్వాత ప్రధానిని కలిసిన ఆయా దేశాల జాతీయ భద్రతా సలహాదారులు, ప్రతినిధులు

భారత్‌ ఆధ్వర్యంలో ఢిల్లీలో ప్రాంతీయ భద్రతా సదస్సు డిక్లరేషన్‌

న్యూఢిల్లీ: తాలిబన్లు స్వాధీనం చేసుకున్న అఫ్గానిస్తాన్‌ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకాలాపాలు ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదని భారత్‌ ఆ«ధ్వర్యంలో బుధవారం జరిగిన భద్రతా సదస్సులో పాల్గొన్న ఎనిమిది ఆసియన్‌ దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. అఫ్గాన్‌ సంక్షోభం విసిరే సవాళ్లపై ఏర్పాటైన ‘ఢిల్లీ రీజనల్‌ సెక్యూరిటీ డైలాగ్‌ ఆన్‌ అఫ్గానిస్తాన్‌’ సదస్సు అంతర్జాతీయ ఉగ్రవాదానికి అఫ్గాన్‌ అడ్డాగా మారకుండా నిరోధించడానికి కలసికట్టుగా పోరాటం చేయాలని నిర్ణయించింది.

సదస్సులో రష్యా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిజ్‌స్తాన్, తజికిస్తాన్, తుర్క్‌మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌ దేశాల భద్రతా సలహాదారులు పాల్గొన్నారు. అఫ్గానిస్తాన్‌లో భద్రతా పరిస్థితులపై ఈ సదస్సులో చర్చ జరిగింది. శాంతియుత, భద్రతాయుత, సుస్థిరమైన అఫ్గానిస్తాన్‌ని చూడటమే తమ లక్ష్యమని సదస్సుకి హాజరైన ప్రతినిధులు పేర్కొన్నారు. కాబూల్, కాందహార్, కుందుజ్‌లో జరిగిన ఉగ్రవాద దాడుల్ని సమావేశం ఖండించింది. పాకిస్తాన్, చైనా ఏవో సాకులు చెప్పి సదస్సుకి దూరంగా ఉన్నాయి.  

నాలుగు అంశాలపై దృష్టి పెట్టాలి: మోదీ
అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల భాగస్వామ్యంతో కూడిన సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. సదస్సు ముగిసిన తర్వాత భద్రతా ప్రతినిధులందరూ కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా మోదీ వారిని ఉద్దేశించి మాట్లాడుతూ అఫ్గానిస్తాన్‌ అభివృద్ధి కోసం నాలుగు సూత్రాలను ప్రతిపాదించారు. సమ్మిళిత ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. అఫ్గాన్‌ భూభాగంపై ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరాదని చెప్పారు. ఇందుకోసం అక్కడ ఉగ్రవాద సంస్థలకు స్థానం లేకుండా చేయాలన్నారు. 

అఫ్గాన్‌ నుంచి మాదక ద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి వ్యూహ రచన చేయాలన్నారు. అఫ్గాన్‌లో జనం ఆకలితో అలమటించిపోతున్నారని, ముష్కరులు వారిపై అకృత్యాలకు పాల్పడుతున్నారని, సంక్షోభం నానాటికీ ముదురుతోందని, ఈ సమస్య పరిష్కారానికి ఇరుగు పొరుగు దేశాలు మానవతాదృక్పథంతో నడుం బిగించాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకి నేతృత్వం వహించి ప్రారంభోపన్యాసం చేసిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్‌ అఫ్గానిస్తాన్‌లో ఇటీవల జరిగిన పరిణామాలు ప్రాంతీయంగానూ సవాళ్లు  విసురుతున్నాయని అన్నారు.  తాలిబన్లతో చర్చల ద్వారానే అఫ్గాన్‌ సమస్యని పరిష్కరించగలమని రష్యా ప్రతినిధి నికోలాయ్‌æ అన్నారు. సదస్సు ఒక డిక్లరేషన్‌ని ఆమోదించింది. మళ్లీ వచ్చే ఏడాది సమావేశం కావాలని అంగీకారానికి వచ్చారు.

డిక్లరేషన్‌లో ఏముందంటే ?  
► అఫ్గానిస్తాన్‌ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యాకలాపాలు జరగకూడదు. అక్కడ ప్రభుత్వం ఉగ్రవాదులకు శిక్షణ, ఆశ్రయం, ఆర్థిక సహకారం అందించకూడదు.
► అఫ్గాన్‌ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తాం. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో ఎవరి జోక్యం ఉండకూడదంటూ పాకిస్తాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ.  
► సామాజికంగా, ఆర్థికంగా కునారిల్లుపోతున్న అఫ్గానిస్తాన్‌ పరిస్థితిపై సదస్సు ఆందోళన. అఫ్గాన్‌ ప్రజలకు మానవత్వంతో అత్య వసరంగా సాయం చెయ్యాలని నిర్ణయం.
► అఫ్గాన్‌లో అన్ని వర్గాల ప్రజలకు నిరాటంకంగా సాయం అందేలా చర్యలు చేపట్టాలి. మానవతా దృక్పథంతో చేసే ఈ సాయంలో ఎలాంటి వివక్షలకు తావు ఉండకూడదు
► మహిళలు పిల్లలు, మైనారిటీల హక్కుల్ని ఎవరూ ఉల్లంఘించకూడదు.  
► అఫ్గానిస్తాన్‌లో అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం లభించేలా ప్రభుత్వం ఏర్పాటుకావాలి.  
► కోవిడ్‌పై పోరాటానికి అఫ్గానిస్తాన్‌కు కావల్సిన సాయం అందించడానికి కట్టుబడి ఉన్నాం. భవిష్యత్‌లో కూడా అన్ని దేశాలు పరస్పర సహకారాన్ని అందించుకుంటాయి.  
► ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు అఫ్గాన్‌లో ఉంటూ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని పర్యవేక్షించాలి. 

మరిన్ని వార్తలు