తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు

22 Aug, 2021 07:40 IST|Sakshi

మహిళా హక్కులు, స్త్రీ స్వేచ్ఛపై తాలిబన్ల హామీలు నీటి మీద రాతలుగా మారుతున్నాయి. అఫ్గాన్‌కు చెందిన నజ్లా ఆయూబీ అనే మాజీ జడ్జి వారి దారుణాలను వెల్లడించారు. అమెరికాలో నివాసముంటున్న నజ్లా ‘స్కై న్యూస్‌’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అఫ్గాన్‌లో మహిళలపై జరుగుతున్న అరాచకాలను బయటపెట్టారు. తమకు వండిన వంట బాగాలేదన్న కారణంగా ఉత్తర అఫ్గాన్‌కు చెందిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి ఆమెకు నిప్పు పెట్టారని ఆయూబీ తెలిపారు.

చదవండి : Afghanistan: మగపిల్లలకు మహిళా టీచర్లు బోధించొద్దు

తమకు ఆహారాన్ని అందించాలని  అక్కడి ప్రజలను తాలిబన్లు ఒత్తిడి చేస్తున్నారని, స్థానిక యువతులను చెక్కపెట్టెల్లో బంధించి సెక్స్‌ బానిసలుగా మార్చేందుకు ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపణలు చేశారు. తమ అధీనంలోని ప్రాంతాల్లోని  యువతులను తమ ఫైటర్లకిచ్చి వివాహం చేయాలంటూ స్థానిక కుటుంబీకులపై ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఒకపక్క ఇన్ని దారుణాలకు పాల్పడుతూ మరోపక్క మహిళలు స్వేచ్ఛగా పని చేసుకోవచ్చని బూటకపు హామీలు  ఇస్తున్నారని ఆయూబీ మండిపడ్డారు.

మహిళల హక్కుల కోసం పోరాడే తనలాంటి వారు తాలిబన్ల పాలనలో జీవించడం కష్టమన్న ఉద్దేశంతోనే తాను పారిపోయి వచ్చినట్లు చెప్పారు. మరోవైపు తమను కార్యాలయాలకు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకున్నారంటూ ఇప్పటికే పలువురు మహిళా జర్నలిస్టులు తమ గోడును ప్రపంచానికి వెళ్లబోసుకున్నారు. అఫ్గాన్‌ జాతీయ జండా పట్టుకున్న వ్యక్తిని చావబాదడం, పోలీసు అధికారి ఒకరిని కాల్చిచంపడం, మైనార్టీ వర్గాలను చిత్రహింసలు పెట్టడం వంటి చర్యలతో తాలిబన్లు తమ క్రూరత్వాన్ని చాటుకుంటున్నారు.    

మరిన్ని వార్తలు