Afghanistan Crisis: ఎలాంటి పరిణామాలైనా ఎదుర్కొనేందుకు సిద్ధం

16 Aug, 2021 21:30 IST|Sakshi
( ఫైల్‌ ఫోటో )

శ్రీనగర్‌: అఫ్గనిస్తాన్‌ తాలిబన్ల హస్తగతమైన నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలపై భారత సరిహద్దు భద్రతా బలగాల డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ఎస్‌ దేశ్వాల్‌ స్పందించారు. అఫ్గన్‌లో జరుగుతున్న పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జమ్మూ నుంచి గుజరాత్‌ వరకు చేపట్టిన సైక్లిస్టుల ‘‘ఫ్రీడం ర్యాలీ’’ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.

ఈ క్రమంలో అఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు వశం చేసుకొన్న వైనం ఇండో- పాక్‌ సరిహద్దు భద్రతపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్న ప్రశ్నలకు బదులుగా... ‘‘పొరుగు దేశంలో జరుగుతున్న పరిణామాలు పూర్తిగా అక్కడి అంతర్గత వ్యవహారం. అయితే, పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నాం. అదే విధంగా ఎలాంటి పరిణామాలు ఎదురైనా ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాం’’ అని దేశ్వాల్‌ వ్యాఖ్యానించారు. అదే విధంగా.. పాకిస్తాన్‌తో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్‌ ఎన్నడూ ఉల్లంఘించలేదని, అయితే దాయాది దేశం కుయుక్తులను తిప్పికొట్టడంలో మాత్రంలో ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. 

కాగా అమెరికా బలగాల ఉపసంహరణతో అఫ్గన్‌లో పూర్వవైభవం పొందిన తాలిబన్లు ఆదివారం పూర్తిగా ఆధిపత్యం సాధించారు. దీంతో ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం విడిచి పారిపోయాడు. ఈ క్రమంలో పాలనా పగ్గాలు చేపట్టేందుకు తాలిబన్‌ సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. మరోవైపు.. పొరుగు దేశాలైన పాకిస్తాన్‌, చైనా.. తాలిబన్లకు స్నేహ హస్తం అందించడం భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపనుందనే అంశం చర్చనీయాంశమైంది.

మరిన్ని వార్తలు