Afghanistan: 20 ఏళ్ల కష్టం పోయింది.. మిగిలింది సున్నా.. అఫ్గాన్‌ ఎంపీ కన్నీటి పర్యంతం

22 Aug, 2021 17:36 IST|Sakshi

న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకి భయాందోళనలు కలిగిస్తున్నాయి. అవకాశం వస్తే.. ఆ దేశం దాటిపోవడానికి లక్షలాది మంది ప్రజలు ప్రయత్నిస్తున్నారు. దీంతో నిత్యం అక్కడ ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక దేశాలు తమ దేశ పౌరులను ప్రత్యేక విమానాల ద్వారా అఫ్గాన్‌ నుంచి తరలిస్తున్నాయి. తాజాగా అఫ్గాన్‌ నుంచి ఓ ప్రత్యేక విమానంలో 168 మంది భారత్‌ చేరుకున్నారు. అఫ్గానిస్తాన్‌ ఎంపీ నరేందర్‌ సింగ్‌ ఖల్సా కాబూల్‌ నుంచి భారత్‌కు చేరుకున్న సందర్భంగా మాట్లాడుతూ..‘‘ నాకు ఏడుపు వస్తోంది. గత 20 ఏళ్లలో సాధించినదంతా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు మిగిలింది సున్నా " అని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

నిలువ నీడ లేదు..!
అఫ్గాన్‌కు చెందిన ఓ మహిళ తన కుటుంబానికి సహాయం చేసినందుకు భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. ‘‘అఫ్గానిస్తాన్‌లో పరిస్థితులు రోజు రోజుకి క్షీణిస్తున్నాయి. తాలిబన్లు మా ఇంటిని తగలబెట్టారు. మాకు నిలువ నీడ లేకుండా చేశారు. భారతీయ సోదరీసోదరులు రక్షణగా నిలిచారు. సహాయం చేసినందుకు నేను భారతదేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అన్నారు. కాగా ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఏసీ-17 విమానం ఆదివారం ఉదయం 10 గంటల ప్రాంతంలో 168 మందితో ఘజియాబాద్‌లోని హిండన్‌ ఎయిర్‌బేస్‌కు చేరింది. వీరిలో  107 మంది భారతీయులతో సహా 168 మందిని కాబూల్‌ నుంచి భారత్‌ తరలించింది.

ఇక కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా మాట్లాడుతూ.. " పోలియో వైరస్‌కు నివారణ చర్యగా అఫ్గానిస్తాన్‌ నుంచి తిరిగి వచ్చిన వారికి ఉచిత పోలియో వ్యాక్సిన్ - ఓపీవీ& ఎఫ్‌ఐపీవీ టీకాలు వేయాలని నిర్ణయించాం. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో వ్యాక్సిన్ డ్రైవ్ ఏర్పాటు చేశాం.’’ అని తెలిపారు.


చదవండి: తాలిబన్లను ప్రశ్నించిన ఎలన్‌ మస్క్‌: వైరల్‌

మరిన్ని వార్తలు