రాజీవ్‌ హత్య కేసు: ఎట్టకేలకు నళినికి విడుదల.. జైలు జీవితం ఎన్ని రోజులో తెలుసా?

12 Nov, 2022 18:40 IST|Sakshi

Rajiv Gandhi Case Nalini Sriharan.. మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్యకేసులో దోషులుగా ఉన్న వారు ఎట్టకేలకు జైలు నుంచి విడుదలవుతున్నారు. దాదాపు 31 సంవత్సరాల జైలు జీవితం అనంతరం దోషిగా ఉన్న నళిని బయటకు వచ్చారు.

ఇక, రాజీవ్‌ గాంధీ హత్య కేసులో దోషులుగా ఉన్న ఆరుగురిని విడుదల చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజీవ్‌ హత్యకేసులో దోషులుగా ఉన్న ఆరుగురిలో ఒకరైన నళిని శ్రీహరన్‌ అలియాస్‌ నళిని మురుగన్‌ వెల్లూర్‌ జైలు నుంచి శనివారం సాయంత్రం విడుదల అయ్యారు. 
కాగా, జైలు అధికారులు.. అవసరమైన ఫార్మాలిటీస్‌ అన్నీ పూర్తిచేసిన తర్వాత నళినిని విడుదల చేశారు. ఇక, రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నళినితో పాటు రాబర్ట్ పయస్‌, రవిచంద్రన్, శ్రీహరన్‌‌, జయకుమార్‌, శంతనును కూడా విడుదల చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, నళిని, రవిచంద్రన్‌లు దాఖలు చేసిన పిటిషన్‌పై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టిన అనంతరం సుప్రీంకోర్టు ఈ తీర్పు వెల్లడించింది. మరోవైపు.. రాజీవ్‌గాంధీ హత్య కేసులో నళిని, శ్రీహరన్‌ అలియాస్‌ మురుగన్, శంతను, ఏజీ పెరారివాళన్, జయకుమార్, రాబర్ట్ పయస్‌, రవిచంద్రన్ అనే ఏడుగురు దోషులుగా ఉన్నారు. గత మే 18న పెరారివాళన్ పెరోల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. మిగిలిన ఆరుగురు దోషులు తమిళనాడులోని వేర్వేరు జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇక, 1991లో శ్రీపెరంబుదూర్‌లో జరిగిన ఆత్మాహుతి దాడిలో మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ మృతిచెందారు. 

మరిన్ని వార్తలు