45 ఏళ్ల తర్వాత సీడబ్ల్యూసీ పోస్టులకు ఎన్నికలు.. చివరకు కాంగ్రెస్‌కు ఇలాంటి స్థితి!

16 Sep, 2022 14:00 IST|Sakshi

ఢిల్లీ: గ్రాండ్‌ ఓల్డ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా కాంగ్రెస్‌లో మునుపెన్నడూ లేనంత సంక్షోభ స్థితి కనిపిస్తోంది. గాంధీ కుటుంబం డామినేషన్‌పై వ్యతిరేకత.. అసమర్థ నిర్ణయాల వల్లే ఇవాళ్టి పరిస్థితి నెలకొందని ఆరోపిస్తూ సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఈ క్రమంలో త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికలు కూడా మరికొందరిని దూరం చేసే పరిస్థితులే కనిపిస్తున్నాయి. 

తాజాగా.. పార్టీ కీలక విభాగమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ(సీడబ్ల్యూసీ)కి సైతం ఎన్నికలు ఉండొచ్చని ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. దాదాపు 45 ఏళ్ల తర్వాత.. సీబ్ల్యూసీకి ఎన్నికలు నిర్వహిస్తుండడం గమనార్హం. మొత్తం 23 మంది సభ్యులుండే సీడబ్ల్యూసీలో 12 మందిని ఎన్నుకోవాలని, మిగతా 11 మందిని నామినేట్‌ చేయాలని అధిష్టానం భావిస్తోంది. ఈ మేరకు కీలక నిర్ణయాన్ని కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్‌ మధుసుధన్‌ మిస్త్రీ ప్రకటించారు. 

CWCకి చివరిసారిగా 1997లో AICC కలకత్తా ప్లీనరీ సెషన్‌లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుండి, ప్లీనరీ సమావేశాలు నామినేషన్లను ఆహ్వానించడానికి బదులుగా సీడబ్ల్యూసీ పునర్మిర్మాణం పేరిట అధ్యక్ష హోదాలో ఉన్నవాళ్లే నిర్ణయం తీసుకునే అధికారం కొనసాగింది. కానీ, పరిస్థితులు ఇప్పుడలా లేవు. గత కొంతకాలంగా కాంగ్రెస్‌లో నెలకొంటున్న పరిణామాల నేపథ్యం, అసమ్మతి గ్రూప్‌-G23ను పరిగణనలోకి తీసుకుని.. నామినేషన్ల స్వీకరణ ద్వారా ఎన్నికలే నిర్వహణకే కాంగ్రెస్‌ మొగ్గుచూపుతోంది.

మరిన్ని వార్తలు