‘ఎవరూ లేని నాకు ఇదే జీవనోపాధి.. కానీ!’

20 Oct, 2020 17:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తమ వ్యాపారం సాగడం లేదంటూ కన్నీరు పెట్టుకున్న ‘బాబా క దాబా’ వృద్ధ దంపతుల వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో విస్తృతంగా వైరల్‌ అయిన విషయం తెలిసిందే. అంతేగాక వారిని ఆదుకోవాలని విజ్ఞప్తులు రావడంతో ప్రజలంతా వారి స్టాల్‌కు క్యూ కట్టడం మొదలు పెట్టారు. దీంతో రాత్రికి రాత్రే వారి కన్నీటి గాథ సుఖాంతం అయ్యింది. ఈ క్రమంలో మంగళవారం మరో 80 ఏళ్ల వృద్దురాలి హృదయ విదారక వీడియో వెలుగులోకి వచ్చింది. రోటివాలి అమ్మగా పేరొందిన ఈ వృద్దురాలు ఆగ్రాలో 15 ఏళ్లుగా రోడ్డ పక్కనే రోటి, మీల్స్‌ తాలిని విక్రయిస్తు జీవిస్తోంది. కరోనా నేపథ్యంలో రోడు సైడ్‌ ఫుడ్‌ను ప్రజలు తినడానికి జంకుతుండటంతో ఆమె వ్యాపారం సాగక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వృద్దురాలికి ఆర్థిక సాయం అందించాలంటూ విజ‍్క్షప్తులు వస్తున్నాయి. (చదవండి: సోషల్ మీడియానా మజాకా: వైరల్ వీడియో)

ఆగ్రాలో రోటివాలి అమ్మగా ప్రసిద్ది చెందిన ఈ వృద్దురాలి పేరు భగవాన్‌ దేవి. తన భర్త మరణించడంతో ఇద్దరు కుమారులు ఆమెను ఒంటరిగా వదిలేశారు. దీంతో వృద్దురాలు ఆగ్రాలో సెయింట్‌ జాన్స్‌ కాలేజీ సమీపంలో రోడ్డు పక్కనే రోటీలు చేసి అమ్ముకుంటుంటోంది. రోడ్‌ సైడ్‌ స్టాల్‌ కావడంతో కరోనా నేపథ్యంలో ఆమె దగ్గర టిఫిన్‌ తినడానికి ఎవరూ ముందుకురావడం లేదు. దీనికి తోడు తన టిఫిన్‌ సెంటర్‌ తీసేయాల్సిందిగా అధికారులు చెప్పడంతో ఆమె వ్యాపారం, జీవనం ప్రశ్నార్థకంగా మారింది. ‘నాకు ఇద్దరూ కుమారులు. ఎవరూ నాకు సహాయం చేయరు. వారే నాతో ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒంటరిగా బతుకుతున్న నాకు ఈ టిఫిన్‌ సెంటరే జీవనోపాధి. ఇది కూడా ఇక్కడి నుంచి తీసేయమంటున్నారు. ఈ టిఫిన్‌ సెంటర్‌ తీసేసి ఎక్కడికి వేళ్లనేను’ అంటూ ఏఎన్‌ఐతో గోడు చెప్పుకుంది. (చదవండి: మిమ్మ‌ల్ని చూసి ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నాం)

తనకంటూ శాశ్వత స్థలం ఉండాలని అర్ధించారు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో మానవతావాదులు స్పందిస్తున్నారు. ఆమెకు మద్దతు తెలుపుతూ నెటిజన్‌లు కామెంట్స్‌ పెడుతున్నారు. ‘అమ్మకు సొంతంగా స్టాల్‌ ఏర్పాటు చేసేందుకు విరాళం ఇవ్వాలనుకుంటున్నాం. ఆమె బ్యాంక్‌ ఖాతా వివరాలను తెలపండి’, ‘ఒక సాయం అందించే ఇచ్చే చేయి పేదవారి జీవితాలలో మార్పు తెస్తుంది. మహమ్మారి వల్ల ఎంతో మంది నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 20 రూపాయలతో ఇతరుల ఆకలిని తీర్చిన రోటివాలి అమ్మకు తన కడుపు నింపుకోవడం కష్టమమైపోయింది’ అంటూ నెటిజన్‌లు స్పందిస్తున్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు