కేంద్ర బడ్జెట్‌పై ఎంపీ జీవీఎల్‌ స్పందన

1 Feb, 2021 17:59 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా, అభివృద్ధి పథంలో పయనించే బడ్జెట్ ఇది అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహరావు పేర్కొన్నారు. పన్నుల భారం మోపకుండా ప్రజల బడ్జెట్‌ మాదిరి ఉందని తెలిపారు. బడ్జెట్‌ అనంతరం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్థిక వ్యవస్థకు ఊపునిచ్చే బడ్జెట్ ఇది అభివర్ణించారు. ఉద్యోగ, ఉపాధి కల్పన కోసం ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని తెలిపారు. మౌలిక వసతులను మెరుగుపరిచేదని చెప్పారు. కేంద్రం ప్రభుత్వం ఆరోగ్య రంగంపై పెట్టే ఖర్చు గణనీయంగా పెంచారని, ఆరోగ్య రంగంలో ఆత్మనిర్భరత సాధించేందుకు నిధులు కేటాయించినట్లు వివరించారు.

మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచేందుకు రూ.లక్ష కోట్ల నిధులు కేటాయించారని ప్రస్తావించారు. అయితే కొన్ని వస్తువులపై సెస్ విధించడంతో మార్కెట్ యార్డులలో మౌలిక సదుపాయాలు పెంచడానికి ఉపయోగపడుతుందని ఎంపీ జీవీఎల్‌ పేర్కొన్నారు. తాగునీటి కోసం జలజీవన్ మిషన్ కోసం నిధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రపంచమంతా ఆర్థికంగా నష్టపోయినా దేశంలో ఆత్మనిర్భరతా నినాదంతో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేలా బడ్జెట్ రూపకల్పన చేశారని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రికి అభినందనలు తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారని చెప్పారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ విమర్శలు చేయడం సహజమేనని తీసిపారేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, పథకాలను తెలుగు రాష్ట్రాలు సరిగా ఉపయోగించుకోవడం లేదని ఆరోపించారు. బడ్జెట్‌లో ప్రస్తావన లేకపోతే నిధులు, మొండిచేయి చూపినట్లు కాదని పేర్కొన్నారు. పోలవరం గురించి రెండు రోజుల్లో కేంద్రం నుంచి స్పష్టమైన వివరణ రానున్నట్లు ప్రకటన చేశారు. ఏపీకి కేంద్రం ఇచ్చే నిధులు, బడ్జెట్ కేటాయింపుల గురించి మీడియా ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తామని ఎంపీ జీవీఎల్‌ నరసింహరావు చెప్పారు.

మరిన్ని వార్తలు