‘వందేభారత్‌’ రైలుకు వరుస ప్రమాదాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

5 Nov, 2022 09:17 IST|Sakshi

ముంబై: గుజరాత్‌– మహారాష్ట్ర రాజధానుల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల ప్రారంభించిన వందే భారత్‌ సెమీ స్పీడు రైలుకు వరుస ప్రమాదాలు జరుగుతుండటంపై రైల్వే శాఖ దృష్టి సారించింది. ఎవరైనా రైల్వేట్రాక్‌ వెంబడి పశువులను వదిలితే చట్ట పరంగా చర్యలు తప్పవని హెచ్చరించింది. ముంబై–గాంధీదీనగర్‌ రైల్వే మార్గం వెంబడి ఉన్న చుట్టుపక్క గ్రామాల సర్పంచ్‌లను రైల్వే భద్రతా విభాగం అధికారులు కలసి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌రైలుకు పశువులు అడ్డం వచ్చి ఆగిపోయిన వరుస ఘటనలు జరిగిన గ్రామాల పెద్దలకు నోటీసులు జారీ చేశారు.

 రైల్వే ట్రాక్‌ వెంబడి పశువులను నిర్లక్ష్యంగా వదలొద్దని, సంబంధిత పశు యజమానులతో మాట్లాడే బాధ్యతలను గ్రామ సర్పంచ్‌లకు అప్పగించారు. రైల్వే ట్రాక్‌లపై ఎవరైనా పశువుల్ని నిర్లక్ష్యంగా వదిలితే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకునేందుకు వెనుకాడమని ఈ సందర్భంగా హెచ్చరించారు. సెపె్టంబరు 30న గాం«దీనగర్‌– ముంబై మార్గంలో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అయితే అప్పట్నుంచి ఇప్పటివరకు వందేభారత్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పశువులు ఢీకొట్టడంతో ఆటంకం ఏర్పడిన ఘటనలు తరచూ జరిగాయి. గత శనివారం గుజరాత్‌లోని అతుల్‌ రైల్వే స్టేషన్‌ సమీపంలో పశువులను ఢీకొట్టి వందేభారత్‌ రైలు ఆగిపోయింది. అంతకుముందు అక్టోబర్‌ 6, 7 తేదీల్లో కూడా ఇవే ఘటనలు జరగడంతో రైలు ముందుభాగం కొంతమేర దెబ్బతింది. దీంతో రైల్వే భద్రతా విభాగం దృష్టి సారించింది. ఎక్కువమొత్తంలో పశువులు ఉన్న యజమానులతో ఆయా గ్రామాల పెద్దలు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించింది.

అయినప్పటికీ పశువులను రైల్వే ట్రాక్‌లపై నిర్లక్ష్యంగా వదులుతూ నిబంధనలను ఉల్లంఘించే వారిపై ప్రొవిజన్స్‌ ఆఫ్‌ రైల్వే యాక్టు 1989, సెక్షన్‌ 154, ప్రకారం ఒక ఏడాదిపాటు జైలుశిక్ష, జరిమాన, లేదా రెండింటిని అ మలు చేయవచ్చని, సెక్షన్‌ 147 ప్రకారం ఆర్నెల్ల పా టు జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా, లేదా రెండూ అమలు చేయవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.   

మరిన్ని వార్తలు