ఒకవైపు చరఖా.. మరోవైపు జేసీబీ బుల్డోజర్‌.. బోరిస్‌పై మీమ్స్‌

21 Apr, 2022 18:45 IST|Sakshi

అహ్మదాబాద్‌: జేసీబీ బుల్డోజర్‌.. ప్రస్తుతం భారత్‌లో ట్రెండింగ్‌లో ఉన్న టాపిక్‌. శ్రీరామ నవమి, హానుమాన్‌ శోభాయాత్రల సందర్భంగా చెలరేగిన మత ఘర్షణల అనంతరం.. ఈ ట్రెండ్‌ మరింత ఊపందుకుంది. అల్లర్లకు కారణమైన వాళ్లకు చెందిన ఇళ్లను, దుకాణాలను, ఇతర కట్టడాలను.. అక్రమ కట్టాలుగా నిర్ధారించుకుని ప్రభుత్వాలు జేసీబీ బుల్డోజర్లతోనే కూల్చేస్తున్నాయి. ఈ క్రమంలో.. 

రెండు రోజుల భారత్‌ పర్యటనకు వచ్చిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌.. బుల్డోజర్‌ ట్రెండ్‌లోకి వచ్చేశారు. ఎలాగంటారా?..  గుజరాత్‌ వడోదరా హలోల్‌ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ జేసీబీ ఫ్యాక్టరీని ఆయన సందర్శించాడు. 

జేసీబీ ఫ్యాక్టరీని ప్రారంభించిన బోరిస్‌.. హుషారుగా జేసీబీ బుల్డోజర్‌ ఎక్కి పరిశీలించి కాసేపు సందడి చేశారు. ఆ సమయంలో ఆయన వెంట.. గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌ కూడా ఉన్నారు. ఇంకేం.. యాధృచ్ఛికంగా జరిగినప్పటికీ ఈ పని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. 1947 నుంచి 2022 వరకు బోరిస్‌ కవర్‌ చేశారంటూ కామెంట్లు పెడుతున్నారు కొందరు. ఎందుకంటే.. అంతకు ముందు సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి.. చరఖా తిప్పారు.

మహాత్ముడి రచనల్లో ఒకటైన, ప్రచురణకాని గైడ్‌ టు లండన్‌ను బోరిస్‌ కానుకగా అందుకున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ గుజరాత్‌లో పర్యటించిన బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌.. రేపు(శుక్రవారం) ఢిల్లీకి వెళ్తారు.

మరిన్ని వార్తలు