ఏనుగులకు కరోనా పరీక్షలు

8 Jun, 2021 19:25 IST|Sakshi
తెప్పకాడు శిబిరంలో ఏనుగులకు కరోనా పరీక్ష చేస్తున్న పశు వైద్య అధికారులు

చెన్నె: ఇన్నాళ్లు మనుషులకు మహమ్మారి కరోనా వైరస్‌ సోకుతుండగా తాజాగా జంతువులకు కూడా ఆ వైరస్‌ వ్యాపిస్తోంది. జంతువులకు మొట్టమొదటి కేసు తెలంగాణలోని నెహ్రూ జూలాజికల్‌ పార్కులో వెలుగు చూడగా అనంతరం తమిళనాడులోని వండలూరు జూలో కూడా జంతువులకు కరోనా సోకింది. అయితే ఇక్కడ వైరస్‌తో ఓ సింహ మృతి చెందడం కలకలం రేపింది. ఆ సింహం ద్వారా 9 సింహాలకు వైరస్‌ పాకింది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సందర్భంగా ఏనుగులకు కూడా వైరస్‌ పరీక్షలు చేయాలని నిర్ణయించింది. 

ఈ సందర్భంగా ముదుమలై టైగర్‌ రిజర్వ్‌లోని తెప్పకాడు ఏనుగుల శిబిరంలో మంగళవారం 28 ఏనుగులకు కరోనా పరీక్షలు చేశారు. వాటి నుంచి నమూనాలను (శాంపిల్స్‌) సేకరించారు. ఉత్తరప్రదేశ్‌లోని ఇన్‌జత్‌నగర్‌లో ఉన్న భారత పశుసంవర్ధక పరిశోధనా సంస్థ (ఇండియన్‌ వెటర్నరీ రీసెర్చ్‌ సెంటర్‌)కు నమూనాలు పంపించాలని ఆ రాష్ట్ర అటవీ శాఖ మంత్రి రామచంద్రన్‌ ఆదేశించారు. ఏనుగుల నుంచి ట్రంప్‌ వాష్‌ శాంపిల్‌, రెక్టల్‌ స్వాబ్‌ను సేకరించినట్లు వెటర్నరీ సర్జన్‌ రాజేశ్‌ కుమార్‌ తెలిపారు. అయితే ఏనుగులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయని, వాటికి వైరస్‌ లక్షణాలు లేవని మరో అధికారి కేకే కౌశల్‌ వివరించారు.

అయితే ముందు జాగ్రత్త చర్యగా వాటి బాగోగులు చూసుకునే మావటిలు, సహాయ సిబ్బంది మొత్తం 52 మందికి కరోనా వ్యాక్సిన్‌ వేయించారు. ఏనుగులకు కరోనా సోకే అవకాశం చాలా తక్కువ అని, ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా వాటికి కరోనా పరీక్షలు చేయించినట్లు అధికారులు తెలిపారు. కరోనాతో సింహం మృతి చెందడంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి స్టాలిన్‌ జూన్‌ 6వ తేదీన జూపార్క్‌ను సందర్శించి వివరాలు తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు