‘రోహింగ్యాలకు ఢిల్లీలో ఫ్లాట్లు’ అంటూ కేంద్ర మంత్రి ట్వీట్‌.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం

17 Aug, 2022 19:02 IST|Sakshi

న్యూఢిల్లీ: రోహింగ్యా శరణార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తామన్న కేంద్రమంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి ప్రకటనపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఆయన ప్రకటనను తోసిపుచ్చింది. రోహింగ్యాలకు అటువంటి హామీలేమీ లేవని తేల్చి చెప్పింది. రోహింగ్యా శరణార్థుల విషయంలో తప్పుడు వార్తలు ప్రచారం అవుతున్నాయని తెలిపింది. న్యూఢిల్లీలోని బక్కర్‌వాలాలో రోహింగ్యా శరణార్థులకు ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్‌లను అందించడానికి  ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని తెలిపింది. అక్రమ విదేశీ శరణార్థులైన వారికి ఎలాంటి సౌకర్యాలు ప్రకటించలేదని స్పష్టం చేసింది.

కాగా, మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యా శరణార్థులకు పక్కా ఇళ్లు, భద్రత కల్పిస్తామని గృహ, పట్టణ వ్యవహరాలశాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి బుధవారం తన ట్విటర్‌ ఖాతా ద్వారా తెలిపారు. వారిని ఔటర్‌ ఢిల్లీలోని బక్కర్‌వాలాలోని ఆర్థికంగా బలహీన వర్గాల (ఈడబ్ల్యూఎస్) అర్ట్‌మెంట్‌లకు తరలిస్తామని పేర్కొన్నారు. అలాగే వారికి ప్రాథమిక సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు. అయితే, ఆయన ప్రకటనపై స్పందించిన కేంద్రం, అలాంటి నిర్ణయమేదీ తీసుకోలేదని తెలిపింది.
చదవండి: Freebies: ఉచిత హామీలపై సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు

‘రోహింగ్యాలను కొత్త ప్రదేశానికి తరలించాలని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇప్పటికే విదేశాంగ శాఖ ద్వారా సంబంధిత దేశంతో వారి బహిష్కరణ విషయాన్ని చర్చిస్తున్నందున.. రోహింగ్యాలు ప్రస్తుతం ఉన్న మదన్‌పూర్ ఖాదర్, కాళింది కుంజ్‌ ప్రదేశాల్లో కొనసాగేలా చూడాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని హోంమంత్రిత్వ శాఖ ఆదేశించింది. చట్టప్రకారం రోహింగ్యా శరణార్థులను బహిష్కరించే వరకు డిటెన్షన్ సెంటర్‌లో( నిర్బంధ కేంద్రం) ఉంచుతాం. ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం శరణార్థులు ఉన్న ప్రదేశాన్ని డిటెన్షన్ సెంటర్‌గా ప్రకటించలేదు.. వెంటనే ఆ పనిచేయాలని ఆదేశించాం.’ అని హోం మంత్రిత్వ శాఖ ట్వీట్‌ చేసింది.

మరిన్ని వార్తలు