అగ్నిపథ్‌ నిరనసలు.. భారత్‌ బంద్‌ ఫెయిల్‌

21 Jun, 2022 07:49 IST|Sakshi

న్యూఢిల్లీ/పట్నా: అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో పలువురు ఇచ్చిన భారత్‌ బంద్‌ పిలుపునకు సోమవారం పెద్దగా స్పందన లభించలేదు. ముందస్తు చర్యలు, భద్రత నడుమ .. బంద్‌ పాక్షికంగా సాగింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైళ్లు, వాహనాల రాకపోకలకు స్వల్పంగా అంతరాయం కలిగింది. యువకులు రోడ్లపై బైఠాయించగా, అదుపులోకి తీసుకున్నారు అంతే. అయితే.. 

చాలా రాష్ట్రాల్లో బంద్‌ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఢిల్లీలో భారీగా ట్రాఫిక్‌ జామైంది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, కేరళ, అస్సాం, రాజస్తాన్‌ తదితర రాష్ట్రాల్లో ఇటీవలి అనుభవాల దృష్ట్యా భద్రతను పటిష్టం చేశారు. సున్నితమైన ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. దుకాణాలు, వ్యాపార వాణజ్య సంస్థలు యథావిధిగా కార్యకలాపాలు సాగించాయి. అగ్నిపథ్‌పై నిరసనల, ఆందోళనల కారణంగా.. రైల్వే శాఖ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. సోమవారం దేశవ్యాప్తంగా 612 రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగినట్లు రైల్వే శాఖ తెలియజేసింది. 602రెళ్లను రద్దు చేసినట్లు తెలిపింది. మంగళవారం కూడా జాగ్రత్తలు పాటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

24న సంయుక్త కిసాన్‌ మోర్చా నిరసనలు 
అగ్నిపథ్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) ఆధ్వర్యంలో ఈ నెల 24న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని భారతీయ కిసాన్‌ యూనియన్‌ నేత రాకేశ్‌ తికాయత్‌ ప్రకటించారు. వాటిలో యువత, పౌర సమాజం ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలు పాలుపంచుకోవాలని కోరారు. దేశవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లో నిరసనలు నిర్వహిస్తామన్నారు. బీకేయూ నేతృత్వంలో 30న తలపెట్టిన ఆందోళన కార్యక్రమాలనూ 24నే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు