Agnipath Protests: అగ్నిపథ్‌ ఆందోళనలు.. కేంద్రం దిద్దుబాటు చర్య, రక్షణ శాఖ కూడా 10 శాతం రిజర్వేషన్‌

18 Jun, 2022 16:43 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: అగ్నిపథ్‌ ఆందోళనలు చల్లార్చేందుకు కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కేంద్ర రక్షణ శాఖ పరిధిలోని ఉద్యోగాల్లో 10 శాతం అగ్నివీర్‌ రిజర్వేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు రిజర్వేషన్‌కు శనివారం కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆమోదం తెలిపారు. 

ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌, సివిల్‌ డిఫెన్స్‌ పోస్టులతో పాటు 16 విభాగాల్లో రిజర్వేషన్‌ను వర్తింపజేయనుంది. త్వరలోనే నియామక నిబంధనల్లో మార్పులు జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది కేంద్ర రక్షణ శాఖ. 

ఇదిలా ఉంటే.. అ‍గ్నివీర్లకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు ఇదివరకే కేంద్ర హోంశాఖ ప్రకటించింది. సీఏపీఎఫ్‌(Central Armed Police Forces), అసోం రైఫిల్స్‌లో అగ్నివీర్లకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్టు హోంశాఖ స్పష్టం చేసింది.

అగ్నిపథ్‌ నిరసనలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పందిస్తూ..  మాజీ సైనికులతో సహా విస్తృత స్థాయి సంప్రదింపుల తర్వాతే అగ్నిపథ్‌ ప్రకటించబడింది. రాజకీయ కారణాల వల్ల అభ్యర్థుల్లో అపార్థం వ్యాపిస్తోంది. అగ్నిపథ్‌.. సాయుధ బలగాల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది. దీనిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కొత్త పథకం కాబట్టి ప్రజల్లో కొంత గందరగోళం ఉండవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు