Agnipath Protests: 700 కోట్ల ఆస్తి నష్టం.. 718 మంది అరెస్ట్‌

19 Jun, 2022 11:06 IST|Sakshi

అగ్నిపథ్‌.. పేరుకు తగ్గట్టే దీనికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనల జ్వాలలు రగులుతూనే ఉన్నాయి.  త్రివిధ దళాల్లో రిక్రూట్‌మెంట్‌ కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని నిరసిస్తూ యువకుల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. బిహార్‌, ఉత్తర ప్రదేశ్‌, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో తీవ్రస్థాయిలో ఆందోళనలు చెలరేగుతున్నాయి. నిరసనలు మరో రూపం దాల్చి హింసాత్మక రంగు పులుముకున్నాయి. గత నాలుగు రోజుల క్రితం రాజుకన్న అగ్గి ఇప్పటి వరకు చల్లారడం లేదు.

700 వందల కోట్ల ఆస్తి హాంఫట్‌
నిరసనకారుల ఆందోళనలో ఇప్పటి వరకు 60 రైళ్లకు నిప్పంటించారు. బిహార్‌లో 11 ఇంజిన్‌లను తగలబెట్టారు. గత నాలుగు రోజుల అల్లర్లలో ఇప్పటి వరకు ఆందోళనకారులు సుమారు 700 వందల కోట్ల రూపాయల ఆస్తిని అగ్నికి ఆహుతి చేశారు. అంతే కాకుండా రైల్వే స్టేషన్లలో స్టాళ్లను తగులబెట్టడంతోపాటు రైల్వేకు చెందిన ఇతర ఆస్తులను ధ్వంసం చేశారు. ఆస్తి నష్టం కేవలం అధికారులు అంచనా వేసినవి మాత్రమే.. అధికారికంగా ఇంకా ఎక్కువే ఉండే అవకాశాలు ఉన్నాయి.
సంబంధిత వార్త: సికింద్రాబాద్‌ కాల్పుల ఘటన: నిరసనకారుల శరీరాల్లో 8 పెల్లెట్లు 

718 మంది అరెస్ట్‌
దేశవ్యాప్తంగా  గడిచిన మూడు రోజుల్లో మొత్తం 138 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయగా, 718 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీసీటీవీ, వీడియో ఫుటేజీల ద్వారా హింసకు పాల్పడుతున్న మరికొంత మందిని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు బిహార్ నిరసనలు విధ్వంసానికి దారి తీశాయి. నిరసనకారులు రైల్వే స్టేషన్లు లక్ష్యంగా దాడి జరుగుతోంది. బిహార్‌లో హింసాకాండకు సంబంధించి ఇప్పటి వరకు 25 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు అయ్యాయి. మొత్తం  250 మందిని అరెస్టు చేశారు. అగ్నిపథ్‌ నిరసనలు ఒక్క బిహార్‌ రాష్ట్రంలోనే 15  జిల్లాలకు విస్తరించాయి.

రైల్వే అధికారుల ప్రకారం.. ఒక జనరల్‌ బోగిని నిర్మాణానికి రూ. 80 లక్షలు ఖర్చు అవుతుంది., అదే స్లీపర్‌ కోచ్‌కు 1.25 కోట్లు, ఏసీ కోచ్‌ రూ. 3.5 కోట్లు ఖర్చు అవుతుంది. ఇక ఒక రైలు ఇంజిన్‌ను తయారు చేసేందుకు ప్రభుత్వం అక్షరాల రూ. 20 కోట్లకు పైగా వెచ్చిస్తోంది. మొత్తంగా చూసుకుంటే 12 బోగీల రైలును ఏర్పాటుకు చేసేందుకు రూ. 40 కోట్లు, 24 కోచ్‌ల ట్రైన్‌ నిర్మించేందుకు రూ. 70 కోట్లకుపైనే ఖర్చు చేస్తోంది. ఆస్తి నష్టం వాటిల్లిన రాష్ట్రాల్లో బిహార్‌లో ఎక్కువగా ఉంది.
ఇది కూడ చదవండి: Agnipath Scheme: అనుమానాలు, వివరణలు

60 కోట్ల మంది టికెట్లు రద్దు
ఇప్పటి వరకు సుమారు రూ. 700 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు  తూర్పు-మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వీరేంద్ర కుమార్ తెలిపారు. ఈ  అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. ఆస్తి నష్టంపై పూర్తి నివేదికను రైల్వే రూపొందిస్తున్నట్లు చెప్పారు. దీనికి తోడు అధికారిక సమాచారం మేరకు 60 కోట్ల మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకున్నారు.  ట్రాక్‌లు దెబ్బతిని రైళ్ల రద్దు ఫలితంగా రైల్వేకు భారీ ఆర్థిక దెబ్బ తగిలింది.  అయినప్పటికీ వీటన్నిటిపై రైల్వే శాఖ అధికారిక అంచనాను విడుదల చేసే పరిస్థితిలో లేనట్లు కనిపిస్తోంది.
చదవండి: ఒకసారి కేసు నమోదైతే మాఫీ ఉండదు!

మరిన్ని వార్తలు