అగ్నిపథ్‌: మేం చెప్పేది విన్నాక నిర్ణయం తీసుకోండి.. సుప్రీంలో కేంద్రం​ కేవియెట్‌

21 Jun, 2022 12:35 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నా అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకంగా.. పలు రాష్ట్రాల్లో నిరసనలు హోరెత్తుతున్నాయి. ఒక్కసారిగా అవి హింసాత్మకంగా మారిన పరిస్థితులు చూస్తున్నాం. మరోవైపు సుప్రీం కోర్టులోనూ ఈ పథకానికి మూడు వ్యతిరేక పిటిషన్‌లు సైతం దాఖలు అయ్యాయి. ఈ తరుణంలో కేంద్రం మంగళవారం ఉదయం కేవియట్‌ దాఖలు చేసింది. 

పిటిషన్‌లపై నిర్ణయం తీసుకోబోయే ముందు తమ వాదనలు వినాలంటూ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది కేంద్రం. అయితే కేవియట్‌లో ప్రత్యేకించి ఎలాంటి అభ్యర్థనను చేయలేదు. కేవలం తమ చెప్పింది మాత్రం పరిగణనలోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టును కేంద్రం కోరడం విశేషం. 

అడ్వకేట్‌ హర్ష్‌ అజయ్‌ సింగ్‌, లాయర్లు ఎంఎల్‌ శర్మ, విశాల్‌ తివారీలు అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ర్లమెంట్‌లో చర్చించి ఆమోదం పొందకుండానే కేంద్రం దీన్ని తీసుకొచ్చిందని పిటిషన్‌దారు అడ్వొకేట్‌ ఎం.ఎల్‌.శర్మ ఆరోపించారు. పథకాన్ని రద్దు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని అభ్యర్థించారు. ఇక కేంద్రం అగ్నిపథ్‌ ప్రకటన వెలువడ్డాక.. జూన్‌ 14వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌ వ్యతిరేక నిరసనలు హోరెత్తుతున్నాయి.

‘అగ్నిపథ్‌’తో బీజేపీకి... సొంత సైన్యం
కోల్‌కతా: అగ్నిపథ్‌ పథకంతో సొంత సైన్యాన్ని ఏర్పాటు చేసుకొనేందుకు అధికార బీజేపీ కుట్రలు పన్నుతోందని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ఆరోపించారు. ఈ పథకం సైనిక దళాలను కించపర్చేలా ఉందన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి, ఇప్పుడు జనాన్ని వెర్రివెంగళప్పలను చేస్తోందని ధ్వజమెత్తారు.

మరిన్ని వార్తలు