Agnipath scheme: దేశ హితానికే నిర్ణయాలు

21 Jun, 2022 02:03 IST|Sakshi
బెంగళూరులోని బేస్‌ యూనివర్సిటీ విద్యార్థులతో మోదీ

అగ్నిపథ్‌పై నిరసనల నేపథ్యంలో మోదీ వ్యాఖ్యలు

సాక్షి, బెంగళూరు: కొత్త నిర్ణయాలు, సంస్కరణలు తొలుత అసమంజసంగా తోచినా, అసంతృప్తికరంగా అనిపించినా అంతిమంగా జాతి నిర్మాణానికే తోడ్పడతాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అగ్నిపథ్‌ పథకంపై వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల కర్ణాటక పర్యటనలో భాగంగా సోమవారం బెంగళూరులో రూ.33 వేల కోట్ల విలువైన 19 ప్రాజెక్టులు, కార్యక్రమాలను మోదీ ప్రారంభించారు. అనంతరం కొమ్మఘట్టదల్లిలో భారీ బహిరంగ సభలో మాట్లాడారు. సరికొత్త లక్ష్యాలను, సంకల్పాలను సాకారం చేసుకునే దిశగా మనల్ని తీసుకెళ్లగలిగేది కేవలం సంస్కరణల పథం మాత్రమేనని పునరుద్ఘాటించారు.

‘‘దశాబ్దాల తరబడి ప్రభుత్వ నియంత్రణలో ఉన్న రక్షణ, అంతరిక్ష రంగాల్లో ప్రైవేటుకు కూడా అవకాశం కల్పించడానికి అదే కారణం. 21వ శతాబ్దపు భారతదేశం ఉపాధి అవకాశాలను, సంపదను సృష్టించే వారిదే. అందుకే ఎనిమిదేళ్లుగా మా ప్రభుత్వం వారిని ఎంతగానో ప్రోత్సహిస్తోంది. అధికార లాలసులైన వ్యక్తులు తమ భావజాలాన్ని మార్చుకోవాలి. బెంగళూరు సాధించిన ప్రగతి మనకు చెబుతున్న పాఠం కూడా అదే’’ అన్నారు. అగ్నిపథ్‌ ఆందోళనలపై మోదీ ఇప్పటిదాకా నేరుగా స్పందించలేదు. సదుద్దేశంతో చేసే పనులు కూడా రాజకీయ రంగు పులుముకోవడం దేశ దౌర్భాగ్యమంటూ ఆదివారం కూడా ఆయన పరోక్ష వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.

బెంగళూరులో బిజీబిజీ
బెంగళూరులో మోదీ పలు కార్యక్రమాలతో బిజీబిజీగా గడిపారు. బెంగళూరు–కొమ్మఘట్టదల్లి సబర్బన్‌ రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఇదిప్పటికే 40 ఏళ్లు ఆలస్యమైందన్నారు. విద్యుద్దీకరణ చేసిన కొంకణ్‌ రైలు మార్గాన్ని ప్రారంభించారు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) క్యాంపస్‌లో రూ.280 కోట్లతో నిర్మించిన సెంటర్‌ ఫర్‌ బ్రెయిన్‌ రీసెర్చ్‌ (సీబీఆర్‌)ను ప్రారంభించారు. దీనికి శంకుస్థాపన చేసింది కూడా తానే కావడం మరింత ఆనందాన్నిస్తోందన్నారు. బాగ్చీ–పార్థసారథి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఏ దేశమైనా ఆరోగ్య రంగానికి అత్యంత ప్రాధాన్యమివ్వాలని ఈ సందర్భంగా మోదీ అన్నారు.

బెంగళూరు కలలను నెరవేరుస్తానని హామీ ఇచ్చారు. ‘‘ఏక్‌ భారత్‌–శ్రేష్ఠ్‌ భారత్‌ స్ఫూర్తిని బెంగళూరు చక్కగా ప్రతిబింబిస్తోంది. లక్షలాది మంది కలల సాకారమే కొన్నేళ్లుగా నగర ప్రగతి రూపంలో ప్రతిఫలిస్తోంది. డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలతో ఎన్ని లాభాలుంటాయో, ప్రభుత్వం అతి జోక్యాన్ని తగ్గించి సరైన అవకాశాలు కల్పిస్తే భారత యువత ఎన్ని అద్భుతాలు సాధిస్తుందో చెప్పేందుకు బెంగళూరే నిదర్శనం. భారత యువతకు ఇదో కలల నగరి. పారిశ్రామిక చొరవ, ఇన్నోవేషన్, ప్రభుత్వ–ప్రైవేటు రంగాలను సమపాళ్లలో వినియోగించుకోవడం వంటివి బెంగళూరును ఇలా తీర్చిదిద్దాయి. బెంగళూరు వర్సిటీ ఆవరణలో అంబేడ్కర్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ విశ్వవిద్యాలయ(బేస్‌) క్యాంపస్‌ను, రూ.4,700 కోట్లతో రూపొందించిన 150 టెక్నాలజీ హబ్‌లను మోదీ ప్రారంభించారు. అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించి విద్యార్థులతో గ్రూప్‌ ఫొటో దిగారు. ఉక్రెయిన్‌లో బాంబు దాడిలో మరణించిన వైద్య విద్యార్థి నవీన్‌ తల్లిదండ్రులను పరామర్శించారు. మైసూరులోనూ పలు శంకుస్థాపనలు చేశారు.

త్రివిధ దళాధిపతులతో నేడు విడిగా మోదీ భేటీలు
అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం త్రివిధ దళాధిపతులతో భేటీ కానున్నారు. సైన్యం, నావికా దళం, వైమానిక దళాధిపతులు ప్రధాని మోదీతో వేర్వేరుగా సమావేశం కానున్నారు. మొదట నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ ఆర్‌.హరికుమార్‌ ప్రధానమంత్రిని కలుస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

నాకు కుర్తా కుట్టిస్తావా?
మైసూరులో కేంద్ర పథకాల లబ్ధిదారులతో మోదీ ముచ్చటించారు. ప్రభుత్వం నుంచి తాను 10 పథకాల ద్వారా లబ్ధి పొందానని అంబిక అనే మహిళ చెప్పింది. కుట్టుమిషన్‌ కూడా తీసుకున్నానడంతో, ‘అయితే నాకు కుర్తా కుట్టిస్తావా?’ అని మోదీ అడిగారు. ‘తప్పకుండా. మంచి కుర్తా కుట్టిస్తా’ననడంతో నవ్వారు. అనంతరం చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.  మంగళవారం మైసూరు ప్యాలెస్‌ ఆవరణలో ప్రపంచ యోగా ఉత్సవాల్లో మోదీ పాల్గొంటారు.
 

మరిన్ని వార్తలు