అగ్నిపథ్‌ పిటిషన్లన్నీ ఢిల్లీ హైకోర్టుకు

20 Jul, 2022 08:14 IST|Sakshi

న్యూఢిల్లీ: సైనిక నియామకాల కోసం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని సవాలు చేస్తూ తన ముందు దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలన్నింటినీ ఢిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ చేసింది. కేరళ, పంజాబ్, హర్యానా, పట్నా, ఉత్తరాఖండ్‌ హైకోర్టులు కూడా తమ వద్ద దాఖలైన పిల్స్‌ను ఢిల్లీ హైకోర్టుకు బదిలీ చేయాలని న్యాయమూర్తులు జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. విచారణను త్వరగా పూర్తి చేయాలని ఢిల్లీ హైకోర్టుకు సూచించింది.   

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగిన నేపథ్యంలో అగ్నిపథ్‌పై వివాదం సుప్రీంకోర్టును తాకింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ దేశ అ‍త్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పలువురు పిటిషన‍్లు దాఖలు చేశారు. అగ్నిపథ్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల గురించి విచారించడానికి, రైల్వేతో సహా ప్రజా ఆస్తులకు జరిగిన నష్టం గురించి విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని ఓ పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. మరోవైపు.. ఈ పథకంలో జాతీయ భద్రత, సైన్యంపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది ఒకరు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఇదీ చదవండి: Agnipath Recruitment: అగ్నిపథ్‌లో ‘కుల’కలం?

మరిన్ని వార్తలు