Agnipath Scheme: అనుమానాలు, వివరణలు

19 Jun, 2022 06:18 IST|Sakshi

అగ్నిపథ్‌ పథకంపై యువత నానా సందేహాలు వ్యక్తం చేస్తుండగా, ఉద్యోగ భద్రత లేదన్న మాటేగానీ ఇదో అవకాశాల నిధి అని కేంద్రం అంటోంది. పథకంపై సందేహాలు, ప్రభుత్వ వివరణలను ఓసారి చూద్దాం...

► 17.5 నుంచి 21 ఏళ్ల వారిని సైన్యంలోకి తీసుకుంటారు. నాలుగేళ్ల తర్వాత 75% మందిని వెనక్కు పంపుతారు. పెన్షనూ ఉండదు. అప్పుడు భవిష్యత్‌ అగమ్యగోచరం కాదా?
అగ్నివీరుల భవిష్యత్తుకు ఢోకా లేదు. రిటైరయేప్పుడు సేవానిధి ప్యాకేజీ కింద ఆదాయ పన్ను మినహాయింపుతో రూ.11.71 లక్షలిస్తారు. దానికి తోడు వ్యాపారాలకు బ్యాంకులు రుణాలిస్తాయి. పన్నెండో తరగతితో సమానమైన సర్టిఫికెట్‌ ఇస్తారు. సైన్యంలో అనుభవంతో తేలిగ్గా ఇతర ఉద్యోగాలు లభిస్తాయి. పైగా రక్షణ శాఖ నియామకాలతో పాటు సీఏపీఎఫ్, అసోం రైఫిల్స్‌ నియామకాల్లోనూ వారికి 10 శాతం కోటా ఉంటుంది. పలు రాష్ట్ర ప్రభుత్వ నియామకాల్లోనూ ప్రాధాన్యముంటుంది.

► కేవలం నాలుగేళ్ల సర్వీస్‌ కోసం ఎవరైనా ఎందుకు అంతగా కష్టపడతారు?
అగ్నిపథ్‌ ఒక అవకాశాల నిధి. దేశంలో 14 లక్షల మంది సైనికులున్నారు. వీరిలో ఏటా 60 వేల మంది రిటైరవుతారు. అగ్నిపథ్‌లో భాగంగా ఖాళీల కంటే 75 శాతం మందిని అదనంగా తీసుకుంటారు. అంటే అవకాశాలు మూడు రెట్లు పెరుగుతాయి. ఆర్మీ శిక్షణతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణ అలవడుతుంది. జీవితాన్ని నచ్చినట్టుగా మలచుకునే అవకాశముంటుంది.

► నాలుగేళ్లకే ఉద్యోగం కోల్పోతే యువత అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదముంది.
ఒక్కసారి యూనిఫాం ధరిస్తే అలా ఎప్పటికీ మారరు. నియమబద్ధమైన జీవితం గడుపుతారు.

► రిటైర్డ్‌ సైనికాధికారులు తదితరులతో సంప్రదింపులు జరపకుండా హడావుడిగా అగ్నిపథ్‌ పథకాన్ని తీసుకొచ్చారు.
వారితో రెండేళ్లు విస్తృతంగా సంప్రదింపులు జరిపాకే తీసుకువచ్చాం. దీనితో ఎన్నో లాభాలంటూ మాజీ అధికారులు స్వాగతించారు.

► బలగాల సామర్థ్యాన్ని పథకం దెబ్బ తీస్తుంది.
స్వల్పకాలిక సర్వీసు కోసం సైన్యంలో నియామకాలు చేపడుతున్న దేశాలెన్నో ఉన్నాయి. భారత్‌ కూడా అలాగే ముందుకెళ్లాలి. ప్రతి 100 మందిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 25 మంది పర్మనెంట్‌ అవుతారు. వారు దేశ రక్షణకు కోటగోడలా మారతారు.

► 21 ఏళ్ల వయసులో మానసిక పరిపక్వత ఉండదు. నమ్మకంగా పని చేయలేరు.
ఎన్నో దేశాలు యువ రక్తాన్నే సైన్యంలోకి తీసుకుంటున్నాయి. ఉడుకు రక్తం ఉన్నప్పుడే ధైర్యం ఎక్కువగా ఉంటుంది. కరోనా వల్ల రెండేళ్లుగా సైన్యంలో నియామకాలు చేపట్టలేదు గనుక ఈ ఏడాదికి వయో పరిమితిని 23 ఏళ్లకు పెంచాం. యువత, అనుభవజ్ఞులు సగం సగం ఉండేలా చూస్తాం.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు