అసెంబ్లీ ఎన్నికల ముందు గుజరాత్‌ ప్రభుత్వంలో కీలక పరిణామం

21 Aug, 2022 13:26 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది ఆఖర్లో జరగనున్నాయి. ఈ తరుణంలో బీజేపీ నేతృత్వంలోని గుజరాత్‌ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ ఇద్దరు కీలక కేబినెట్‌ మంత్రులకు కేటాయించిన శాఖలను తగ్గించారు. ఇద్దరు రాష్ట్ర మంత్రుల శాఖలను తగ్గిస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. మంత్రి రాజేంద్ర త్రివేది పోర్టిఫోలియోల నుంచి కీలక శాఖ అయిన రెవెన్యూను, పూర్ణేశ్‌ మోదీ శాఖల్లోని కీలకమైన రోడ్డు, భవనాల శాఖను ముఖ్యమంత్రి తొలగించారు. కొద్ది నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అకస్మాత్తుగా ఇలా మంత్రివర్గంలో మార్పులు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

రాజేంద్ర త్రివేది, పుర్ణేశ్‌ మోదీల నుంచి తొలగించిన రెండు శాఖలను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ పర్యవేక్షించనున్నారు. రాజేంద్ర త్రివేది వద్ద న్యాయ, విపత్తు నిర్వహణ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖలు ఉన్నాయి. మరోవైపు.. పూర్ణేశ్‌ మోదీ వద్ద రవాణా, పౌర విమానయాన, పర్యటకం, దేవాదాయ అభివృద్ధి శాఖలు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. భూపేంద్ర పటేల్‌ ప్రభుత్వంలోని 10 కేబినెట్‌ ర్యాంక్‌ మంత్రుల్లో త్రివేది, మోదీలు ఉన్నారు. అయితే, రోడ్లు, భవనాల విభాగం, రెవెన్యూ విభాగల పనితీరు సరిగా లేదని సీఎంకు ప్రభుత్వ వర్గాలు సూచించిన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

మరోవైపు.. హర్ష రమేశ్‌కుమార్‌ సంఘ్వీకి రెవెన్యూ శాఖ సహాయ మంత్రిగా, జగదీశ్‌ ఐశ్వర్‌ పంచల్‌కు రోడ్లు, భవనాల శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు అప్పగించారు సీఎం భూపేంద్ర పటేల్‌. గత ఏడాది సెప్టెంబర్‌లో విజయ్‌ రూపానీ స్థానంలో ముఖ్యమంత‍్రిగా బాధ్యతలు తీసుకున్నారు భూపేంద్ర పటేల్‌. ఇప్పుడు సరిగ్గా అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరిగిన తాజా పరిణామం వెనుకున్న కారణం ఏంటన్నది మాత్రం తెలియరాలేదు.

ఇదీ చదవండి: ‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ట్రావెల్‌ బ్యాన్‌పై మనీశ్‌ సిసోడియా విమర్శలు

మరిన్ని వార్తలు