అసెంబ్లీ ఎన్నికల వేళ గుజరాత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం

29 Oct, 2022 18:28 IST|Sakshi

అహ్మదాబాద్‌: గుజరాత్‌ శాసనసభ ఎన్నికలు దగ్గరపడుతున్న క్రమంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి (యునిఫామ్‌ సివిల్‌ కోడ్‌ -యూసీసీ)ని అమలు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. శనివారం జరిగిన రాష్ట్ర కేబినెట్‌ భేటీలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యూసీసీ ప్యానల్‌లో సభ్యుల వివరాలను గుజరాత్‌ హోంమంత్రి హర్ష సంఘవి వెల్లడించనున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

మరోవైపు.. కేబినెట్‌ సమావేశం అనంతరం ట్వీట్‌ చేశారు ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌. ‘కేబినెట్‌ సమావేశంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అవసరాన్ని పరిశీలించేందుకు రిటైర్డ్‌ సుప్రీంకోర్టు లేదా హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఓ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని యూసీసీపై ముసాయిదాను సిద్ధం చేస్తుంది’ అని భూపేంద్ర పటేల్ తెలిపారు.

గత మే నెలలో యూసీసీని తమ రాష్ట్రంలో అమలు చేస్తామని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో భాజపా ఈ హామీని ప్రకటించింది. అన్నట్లుగానే పుష్కర్‌ సింగ్ ధామీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే యూసీసీని అమలు చేసేందుకు నిపుణులతో కూడిన హైపవర్‌ కమిటీని ఏర్పాటు చేశారు. అదే నెలలో హిమాచల్‌ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్‌ సైతం యూసీసీ అమలు చేస్తామని వెల్లడించారు. తాజాగా గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల వేళ అక్కడ సైతం ఉమ్మడి పౌరస్మృతి అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం సిద్ధమవుతండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చదవండి: 7 నెలలగా అచేతన స్థితిలో గర్భిణీ.. పండండి ఆడబిడ్డకు జన్మ

మరిన్ని వార్తలు