Tamil Nadu: చిక్కుల్లో నిలోఫర్‌

23 May, 2021 10:29 IST|Sakshi

సాక్షి, చెన్నై: మాజీ మంత్రి నిలోఫర్‌ కఫిల్‌ చిక్కుల్లో పడ్డారు. 104 మంది వద్ద ఉద్యోగం పేరిట ఆమె మోసానికి పాల్పడడం శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఆమె వ్యక్తిగత కార్యదర్శి  ప్రకాశం డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. వేలూరు జిల్లా వాణియంబాడికి చెందిన నిలోఫర్‌ కఫిల్‌ గత కెబినెట్‌లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. అదే సమయంలో ఆమె అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో ఈ ఎన్నికల్లో ఆమెకు అన్నాడీఎంకే సీటు ఇవ్వలేదు. రాష్ట్రంలో అధికారం మారడంతో మాజీ మంత్రి గుట్టును ఆమె వ్యక్తిగత కార్యదర్శి బయటపెట్టారు.

104 మంది వద్ద వసూలు.. 
మంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో నిలోఫర్‌ చేసిన అక్రమాల గురించి ఆమె వ్యక్తిగత కార్యదర్శి ప్రకాశం డీజీపీ కార్యాలయంలో లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన తనకు మంత్రి నుంచి అనేక సూచనలు, ఆదేశాలు రావడం జరిగిందని గుర్తు చేశారు. అలాగే 104 మందికి ఉద్యోగ కల్పన విషయంగా నిలోఫర్‌ తనకు సూచనలు ఇచ్చారని, ఆ వ్యక్తులు ఇచ్చిన నగదును ఆమె తనయుడు, బంధువులకు తీసుకెళ్లి ఇచ్చానని తెలిపారు.

ఇలా రూ. 6.62 కోట్ల మేరకు వసూలు చేసినట్లు పేర్కొన్నారు. అయితే గత ఏడాది కరోనా కాలం నుంచి ఉద్యోగాల కోసం సొమ్ములు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి వచ్చినా మంత్రి దాటవేస్తూ వచ్చారన్నారు. అధికారంలోకి మళ్లీ వస్తామని, చూసుకుందామని నచ్చ చెప్పారని, అయితే ఆమెకు ఈసారి సీటు ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ 104 మంది తనపై ఒత్తిడి తెస్తున్నారని, తనకు సంబంధం లేని వ్యవహారంతో మానసిక ఒత్తిడి పెరిగిందని వాపోయారు.

ఆత్మహత్య చేసుకోవాలన్న భావన కలిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే మంత్రిగా నిలోఫర్‌ చేసిన మోసాలను డీజీపీ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. బాధితులకు న్యాయం చేసి తనకు విముక్తి కలిగించాలని కోరారు. కాగా నిలోఫర్‌ కఫిల్‌ను అన్నాడీఎంకే నుంచి తొలగిస్తూ ఆ పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరు సెల్వం, కో కన్వీనర్‌ పళనిస్వామి ప్రకటన విడుదల చేశారు.
చదవండి: Kamal Haasan: కమల్‌కు కోర్టులో ఊరట

మరిన్ని వార్తలు