కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ.. కీలక విషయాలు వెల్లడి

20 Aug, 2021 08:22 IST|Sakshi

అన్నాడీఎంకే అగ్రనేతల తీవ్ర ఆరోపణ 

కట్టడి చేయాలని గవర్నర్‌కు ఫిర్యాదు 

సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే ప్రభుత్వం ప్రజాపాలనను విస్మరించి.. ప్రతిపక్షంపై కుట్రలకు పాల్పడుతోందని అన్నాడీఎంకే ఆరోపించింది. ఈమేరకు ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోవాలని గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌ను గురువారం చెన్నైలో కలిసి వినతిపత్రం సమర్పించింది. దివంగత ముఖ్యమంత్రి జయలలిత అప్పుడప్పుడూ నీలగిరి జిల్లా కొడనాడు ఎస్టేట్‌లో విశ్రాంతి కోసం వెళ్లేవారు. ఆమె మరణించిన తరువాత కొడనాడు ఎస్టేట్‌లో దోపిడీ, సెక్యూరిటీ గార్డు హత్య ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ అంశాలకు సంబంధించి సయాన్‌ ముఠాకు చెందిన 10 మందిని పోలీసులు అరెస్ట్‌ చేసి కేసులు పెట్టారు. బెయిల్‌పై బయట ఉన్న సయాన్‌ను పోలీసులు మంగళవారం ప్రశ్నించారు.

ఒక ముఖ్యనేత ఆదేశాల మేరకే కొడనాడు ఎస్టేట్‌ బంగ్లాలో దాచి ఉంచిన ఆస్తి పత్రాలు ఎత్తుకెళ్లేందుకు వెళ్లినప్పుడు.. సెక్యూరిటీ గార్డును హత్యచేసినట్లు ఆ కేసులో ప్రధాన నిందితుడైన సయాన్‌ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేగాక ఆస్తి పత్రాలను ఎడపాడికి అందజేసినట్లు కూడా అతను వెల్లడించినట్లు చెబుతున్నారు. ఈ అంశాన్ని బుధవా రం నాటి అసెంబ్లీ సమావేశంలో ఎడపాడి లేవనెత్తగా స్పీకర్‌ అడ్డుకోవడంతో అన్నాడీఎంకే సభ్యులంతా వాకౌట్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి, ఉప నేత ఓ పన్నీర్‌సెల్వం సహా పలువురు అన్నాడీఎంకే సీనియర్‌ నేతలు చెన్నైలోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ భన్వారీలాల్‌ పురోహిత్‌ను గురువారం కలుసుకున్నారు. 

మా నేతలపై తప్పుడు కేసులు– ఎడపాడి
అన్నాడీఎంకే నేతలపై డీఎంకే ప్రభుత్వం కక్షసాధింపు ధోరణి, కుట్రపూరిత చర్యలకు పాల్పడు తోందని గవర్నర్‌ను కలిసిన  అనంతరం ఎడపాడి పళనిస్వామి మీడియా వద్ద ఆరోపించారు. తమ పారీ్టకి చెందిన మాజీ మంత్రులు ఎంఆర్‌ విజయభాస్కర్, ఎస్‌పీ వేలుమణి ఇళ్లలో డీఎంకే ప్రభుత్వం తనిఖీలు చేయించి అక్రమ కేసులు బనాయించిందని ఆరోపించారు. తమ పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం ఇంకా కొనసాగుతోందని అన్నారు. కొడనాడు కేసు కోర్టులో విచారణ తుదిదశకు చేరుకోగా, ప్రభుత్వం కొత్తగా విచారణ ప్రారంభించిందని విమర్శించారు. ఈ విషయాన్ని ఎన్నికల మేనిఫెస్టోలోనే పేర్కొన్నామని సీఎం స్టాలిన్‌ సమర్థించుకుంటున్నారు. కాగా నిందితులంతా కేరళకు చెందిన పాత నేరస్తులని, వారిని కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఎడపాడి దుయ్యబట్టారు. ఈ కేసులో తనతోపాటూ కొందరు అన్నాడీఎంకే నేతలను సైతం ఇరికించే ప్రయత్నాలు సాగుతున్నట్లు మీడియాలో కథనాలు వచ్చాయన్నారు. డీఎంకే ప్రభుత్వ కక్షసాధింపు ధోరణిని అడ్డుకోవాలని కోరుతూ గవర్నర్‌కు వినతిపత్రం సమరి్పంచామని ఎడపాడి వెల్లడించారు. 

మరిన్ని వార్తలు