తమిళనాట ట్విస్ట్‌.. పళనిస్వామి సంచలన నిర్ణయం?  

30 Jan, 2023 07:46 IST|Sakshi

సాక్షి, చెన్నై: భారతీయ జనతా పార్టీతో తెగదెంపులకు పళని శిబిరం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తమకు రెండాకుల గుర్తు దక్కినా..దక్కకున్నా ఈ ఉప ఎన్నికలో తమ అభ్యర్ధిని నిలబెట్టి తీరుతారలని పళని స్వామి భావిస్తున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలతో ఆదివారం జరిపిన చర్చల్లో నిర్ణయించినట్లు సమాచారం. 

కాంగ్రెస్‌ పరుగులు.. 
మరోవైవు ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఈవీకేఎస్‌ ఇలంగోవన్‌ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్ధికి మద్దతుగా డీఎంకే దూసుకెళ్తోంది. 50 వేల ఓట్ల మెజారిటీ సాధించడమే లక్ష్యంగా 11 మంది మంత్రులు, 22 మంది ముఖ్య నేతలు ఇంటింటికీ వెళ్లి ఓట్ల వేటలో ఉన్నారు. అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం, డీఎండీకే కూడా అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల పనులు ప్రారంభించారు. అయితే అన్నాడీఎంకేలో విభేదాల నేపథ్యంలో ఆ పార్టీ చర్చలు, సమీక్షలు, సమావేశాలకే పరిమితమైంది. ప్రధానంగా జాతీయ పార్టీ బీజేపీ మద్దతు కోసం అన్నాడీఎంకేలోని పన్నీరు సెల్వం, పళణి స్వామి శిబిరాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో పాటు ముఖ్య నేతలను ఇప్పటికే ఇరు శిబిరాల ప్రతినిధులు వేర్వేరుగా కలిసి మద్దతు కోరారు. అధికారికంగా బీజేపీ నుంచి ఇంత వరకు ఏ శిబిరానికీ మద్దతు దక్కలేదు. దీంతో తమ అభ్యర్థిని ప్రకటించాలని పళని శిబిరం నిర్ణయించింది.  

తీవ్ర ప్రయత్నాలు.. 
రెండాకుల గుర్తు కోసం సోమవారం సుప్రీంకోర్టులో పళని స్వామి శిబిరం చివరి ప్రయత్నం చేయనుంది. కేంద్రం మద్దతు ఉన్న పక్షంలో ఎన్నికల యంత్రాంగం ద్వారా గుర్తుతో పాటు, బీఫాంలో సంతకం పెట్టే అధికారం తనకు దక్కుతుందని ఇన్నాళ్లూ పళని స్వామి భావించారు. అయితే బీజేపీ ఏ విషయాన్నీ స్పష్టం చేయకపోవడం ఆయన్ని కలవరంలో పడేసింది. దీంతో, ఆదివారం ఈరోడ్‌లో జరిగిన పార్టీ నేతల సమావేశంలో రెండాకుల చిహ్నం కోసం చివరి వరకు ప్రయత్నిద్దామని, అది దక్కని పక్షంలో స్వతంత్రంగానైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని నేతలకు ఆయన తేల్చిచెప్పినట్లు తెలిసింది. కాగా ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.  

రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ
ఈరోడ్‌ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నికకు గాను.. మంగళవారం నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇందుకోసం ఈరోడ్‌ కార్పొరేషన్‌ ఆవరణలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా శివకుమార్‌ వ్యవహరించనున్నారు. నామినేషన్‌ దాఖలుకు వచ్చే అభ్యర్థులకు కఠిన ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే నామినేషన్లు స్వీకరిస్తారు. అభ్యర్థితో పాటు కార్యాలయంలోకి నలుగురిని మాత్రమే అనుమతిస్తారు. ఊరేగింపుగా వచ్చే వాహనాలను 100 మీటర్ల దూరంలోనే ఆపేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల సైతం తమ వాహనాలను అక్కడే ఆపేసి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. నియోజకవర్గంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన, ఎన్నికల ఖర్చు తదితర వ్యవహారాల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల బృందం మంగళవారం ఈరోడ్‌కు రానుంది. ఇప్పటికే అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం, డీఎంకే వర్గాలపై పదుల సంఖ్యలో కోడ్‌ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా, తూర్పు నియోజకవర్గ పరిధిలో గత కొద్ది రోజులుగా రూ. 2 వేలు, రూ. 500 నోట్ల చెలామణి పెరగడం గమనార్హం. 

మరిన్ని వార్తలు