దిండుగల్‌లో పోస్టర్ల హల్‌చల్‌ 

20 Aug, 2020 09:34 IST|Sakshi

సీఎం పన్నీరు.. డిప్యూటీ పళని 

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సీఎం వివాదం రోజుకో రూపంలో తెరపైకి వస్తోంది. దిండుగల్‌లో సీఎం పన్నీరు.. డిప్యూటీ పళని అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇది దిండుగల్‌ అన్నాడీఎంకే గ్రూపువార్‌ను తెరపైకి తెచ్చింది. 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి అంటూ మంత్రులు సెల్లూరు రాజు, కేటీ రాజేంద్ర బాలాజీల భిన్న వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే.  ఇది కాస్త సీఎం, డిప్యూటీ సీఎం శిబిరాల మధ్య చిచ్చుకు దారి తీసింది. బుధవారం దిండుగల్‌ జిల్లాలో సీఎంపన్నీరు..డిప్యూటీ పళని అంటూ పోస్టర్లు వెలిశాయి.

దిండుగల్‌ జిల్లా అన్నాడీఎంకేలో మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్, మంత్రి దిండుగల్‌ శ్రీనివాసన్‌ కీలకం. ఇది వరకు పన్నీరు విశ్వాసపాత్రుడి ఉన్న విశ్వనాథన్, ప్రస్తుతం సీఎం పళనికి నమ్మకస్తుడయ్యారు. ఇది దిండుగల్‌ శ్రీనివాసన్‌ మద్దతుదారుల్ని కలవరంలో పడేసింది. నత్తం రూపంలో శ్రీనివాసన్‌కు చిక్కులు తప్పవన్న ఆందోళన బయలుదేరింది. ఈ పరిస్థితుల్లో  రెండు శిబిరాల వివాదం కాస్త సీఎం ఎవరో చర్చను మరోమారు తెరపైకి తెచ్చింది. 2021 ఎన్నికల్లో గెలుపుతో సీఎంగా పన్నీరు, డిప్యూటీ సీఎంగా పళని వ్యవహరించడం ఖాయం అంటూ వెలిసిన ఈ పోస్టర్లు దిండుగల్‌ రాజకీయ గ్రూప్‌ వార్‌ను తెర పైకి తెచ్చింది.  

మరిన్ని వార్తలు