Tamil Nadu: మధుసూదనన్‌ ఇక లేరు! 

6 Aug, 2021 07:55 IST|Sakshi
అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌

3 రోజుల సంతాప దినాలు

సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌(81) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారం అన్నాడీఎంకే వర్గాల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మూడు రోజులపాటు సంతాపదినాలు పాటించేందుకు సమన్వయ కమిటీ నిర్ణయించింది. జీవించి ఉన్నంత కాలం, ఆయనే పారీ్టకి శాశ్వత ప్రిసీడియం చైర్మన్‌ అని జయలలిత వద్ద ముద్రపడ్డ నాయకుడు మధుసూదనన్‌. దివంగత ఎంజీఆర్‌కు వీరాభిమానిగా,  ఉత్తర చెన్నై అన్నాడీఎంకేలో కీలక నేతగా, మాజీ మంత్రిగా, పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా అన్నాడీఎంకేలో కీలక పదవుల్లో ఉన్న మధుసూదనన్‌ మూడు నెలలుగా అనారోగ్య సమస్యలు, వయోభారంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు.

చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారంతో అన్నాడీఎంకే వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మరణం పారీ్టకి తీరని లోటుగా అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్‌ పన్నీరుసెల్వం, కో కనీ్వనర్‌ పళనిస్వామి ప్రకటించారు. మూడు రోజులు సంతాప దినం పాటించేందుకు నిర్ణయించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణా టక, కేరళ రాష్ట్రాల్లో పార్టీ, అనుబంధ విభాగాల తరఫున అన్ని కార్యక్రమాలు రద్దు చేశారు.  

విశ్వాసపాత్రుడు.... 
ఎంజీఆర్‌ అంటే మధుసూదనన్‌కు వీరాభిమానం. తన 14వ ఏట ఉత్తర చెన్నై వేదికగా ఎంజీఆర్‌కు అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి తెరపైకి వచ్చారు. 1972లో అన్నాడీఎంకే ఆవిర్భావంతో ఉత్తర చెన్నై అన్నాడీఎంకేలో కీలక నేతగా అవతరించారు. ఎంజీఆర్‌ మరణం తర్వాత జయలలిత వెన్నంటి నడిచిన ఆయన 1991లో ఆర్కేనగర్‌ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ కాలంలో చేనేత శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2007లో ఆయన్ను అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా జయలలిత నియమించారు. జీవించి ఉన్నంత కాలం ఆయనే పారీ్టకి ప్రిసీడియం చైర్మన్‌ అని స్వయంగా జయలలిత అప్పట్లో ప్రకటించారు. పార్టీ వ్యవహరాలను చివర్లో ఆయనతో చర్చించినానంతరం ప్రకటన రూపంలో జయలలిత విడుదల చేసేవారు.

జయలలిత మృతి తర్వాత పరిణామాలతో మాజీ సీఎం పన్నీరుసెల్వం వెన్నంటి నడిచారు. తర్వాత పన్నీరు, పళనిల ఏకంతో అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గానే వ్యవహరిస్తూ వచ్చారు. ఈ వివాదాల నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ, చిహ్నాన్ని ఎన్నికల కమిషన్‌ మధుసూదనన్‌ చేతిలో అప్పగించడం గమనార్హం. ఆయన ప్రిసీడియం చైర్మన్‌ అన్న పదవితోనే చివరి శ్వాసను విడిచారు. ఆయన పారి్థవదేహాన్ని తండయారుపేటలోని ఆయన నివాసంలో ఆప్తులు, పార్టీ వర్గాల సందర్శన నిమిత్తం ఉంచారు. శుక్రవా రం సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి.

మరిన్ని వార్తలు