Panneerselvam.. తమిళనాడు పాలిటిక్స్‌లో ట్విస్ట్‌.. పన్నీర్‌సెల్వానికి బిగ్‌ షాక్‌ 

20 Jul, 2022 08:05 IST|Sakshi

Panneerselvam.. పన్నీర్‌సెల్వం రాజకీయ జీవితంలో ఉద్వాసనల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన అన్నాడీఎంకే కోశాధికారి పదవి, ప్రాథమిక సభ్యత్వంతో సహా పార్టీ నుంచి శాశ్వత బహిష్కరణకు గురయ్యారు. ఇక తాజాగా ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఆర్‌బీ ఉదయకుమార్‌ ఎంపిక కావడంతో పన్నీర్‌ చేతి నుంచి ఈ పదవి కూడా చేజారిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. 

సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకేలో గందరగోళ పరిస్థితులు కొనసా..గుతూనే ఉన్నాయి. తాజాగా ఆ పార్టీ నుంచి రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష ఉప నాయకుడిగా ఆర్‌బీ ఉదయకుమార్‌ ఎంపికయ్యారు. ఈయన ఎడపాడి పళనిస్వామి వర్గానికి చెందిన నాయకుడు. ఇందుకు సంబంధించిన పత్రాన్ని స్పీకర్‌ అప్పావుకు ఎస్పీ వేలుమణి బుధవారం అందజేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ స్థానంలో ఉన్న పన్నీర్‌సెల్వం పదవీచ్యుతులయ్యే అవకాశం ఉంది. కాగా ఈనెల 11వ తేదీ అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి  పళనిస్వామి తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎంపికకాగా, పన్నీర్‌సెల్వంను శాశ్వతంగా బహిష్కరించారు. అదే సమయంలో కోశాధికారి పదవి, ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా ఓపీఎస్‌ను తప్పించారు. అతని మద్దతుదారులపై కూడా వేటు వేశారు.  

ఉన్న ఆ ఒక్క పదవీ..? 
ప్రస్తుతం పన్నీర్‌సెల్వం చేతులో ప్రస్తుతం ఉండేది ప్రతిపక్ష ఉప నాయకుడి పదవి మాత్రమే. పార్టీ బహిష్కరణ వేటు వేసినా.. ప్రజాప్రతినిధిగా పన్నీరు సెల్వం అసెంబ్లీలో కొనసాగే అవకాశం మాత్రం ఉంటుంది. దీంతో ఎడపాడి ఆలోచనలో పడ్డారు. ఆ పదవి నుంచి కూడా పన్నీర్‌ను ఎలాగైనా తప్పించేందుకు కొన్నిరోజులుగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. పన్నీర్‌స్థానంలో ప్రత్యామ్నాయ నేత కోసం చెన్నై అడయారులోని ఓ ప్రయివేటు హోటల్‌లో ఎడపాడి మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం ఉదయకుమార్‌ పేరును ఖరారు చేశారు. ఈ నిర్ణయానికి సంబంధించి ఎడపాడి పళనిస్వామి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17వ తేదీన అన్నాడీఎంకే శాసనసభ పక్ష సమావేశం నిర్వహించి, ప్రతిపక్ష ఉప నాయకుడిగా తిరుమంగలం నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్‌బీ ఉదయకుమార్‌ను ఎంపిక చేసినట్లు  పేర్కొన్నారు. తరువాత మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి చెన్నై సచివాలయంలో స్పీకర్‌ అప్పావును కలిసి ఉదయకుమార్‌ నియామకపత్రాన్ని అందజేశారు. 

ఈసీ, కోర్టు తీర్పు పైనే.. 
అన్నాడీఎంకే నుంచి పన్నీర్‌సెల్వం, వైద్యలింగం, మనోజ్‌ పాండియన్‌ను తొలగించినందున వారిని అధికారికంగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలుగా పరిగణించే పరిస్థితి ఉండదు. అయితే ఈ అంశంపై ఓపీఎస్‌ కోర్టు, ఎన్నికల కమిషన్‌లో పిటిషన్లు వేసి ఉన్నందున ఆ రెండు చోట్ల నుంచి స్పష్టత వచ్చేవరకు ఎమ్మెల్యేల గుర్తింపుపై స్పీకర్‌ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అలాగే ప్రతిపక్ష ఉప నాయకుడి పదవి ఈ విషయంలోనూ ఏకపక్ష నిర్ణయానికి తావులేకుండా చట్ట ప్రకారం నడుచుకుంటానని స్పీకర్‌ అప్పావు తెలిపా రు. ఎస్పీవేలుమణి ఓ ఉత్తరం అందజేశారని, అయితే అంతకు ముందే పన్నీర్‌సెల్వం సమరి్పంచిన వినతిపత్రం పరిశీలనతో ఉందని ఆయన పేర్కొన్నారు. 

ముందస్తు బెయిల్‌ కోసం.. 
అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద ఈనెల 11వ తేదీన చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో ఈపీఎస్, ఓపీఎస్‌ వర్గాల కార్యకర్తలకు పోలీసులు సమన్లు పంపారు. వీటిలో పేర్కొన్న ప్రకారం చెన్నై రాయపేట పోలీస్‌స్టేషన్‌లో ఓపీఎస్‌కు చెందిన 30 మంది బుధవారం హాజరుకాలేదు. అరెస్ట్‌ చేసే అవకాశం ఉండడంతో వారు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు. ఇక 12 మంది పళనిస్వామి మద్దతుదారులు కూడా గురువారం పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాల్సి ఉంది. అయితే ఎడపాడి వర్గం కూడా బుధవారం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసినట్లు తెలియడంతో.. వారు సైతం విచారణకు హాజరయ్యే అవకాశం ఉండదని భావిస్తున్నారు. 
 

మరిన్ని వార్తలు