2024 ఎన్నికలపై మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు.. కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే!

22 Feb, 2023 13:31 IST|Sakshi

ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో బీజేపీని గద్దెదింపుతూ కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని జోస్యం చెప్పారు. ఈ సంకీర్ణ ప్రభుత్వానికి కాంగ్రెస్‌ నాయకత్వం వహిస్తుందన్నారు. కలిసి వచ్చేప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళతామని అన్నారు. మోదీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయన్న ఆయన ప్రజలే బీజేపీ ప్రభుత్వానికి బుద్ది చెబుతారని పేర్కొన్నారు. ఈమేరకు నాగాలాండ్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆయన మాట్లాడుతూ.. 2024లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వస్తుందని అన్నారు. తమ పార్టీ ఇతర పార్టీలతో చర్చలు జరుపుతోందని వెల్లడించారు. ఒకవేళ కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుంటే దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం లేకుండా పోతుందని చెప​ఆరు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మెజారిటీ రాదని..  కాంగ్రెస్‌, మిత్రపక్షాలన్నీ కలిస్తే మెజారిటీ సాధిస్తుందని పేర్కొన్నారు.  100 మంది మోదీలు, అమిత్‌ షాలు వచ్చినా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ఖర్గే స్పష్టం చేశారు.

‘దేశాన్ని ఎదుర్కోగల ఏకైక వ్యక్తిని నేనే.. ఇతరులెవరూ నన్ను తాకలేరంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అనేక సార్లు అన్నారు. ప్రజాస్వామ్యవాది ఎవరూ ఇలా మాట్లాడరు. మీరు ప్రజాస్వామ్యంలో ఉన్నారని గుర్తుంచుకోండి. మీరు నియంత, నిరంకుశ వ్యక్తి కాదు. ప్రజలచేత ఎన్నుకోబడిన వారు, ప్రజలే మీకు గుణపాఠం చెబుతారు’ అని మండిపడ్డారు.
చదవండి: సీఎం కొడుకు నుంచి ప్రాణహాని.. సంజయ్‌ రౌత్‌ సంచలన ఆరోపణలు

మరిన్ని వార్తలు