పొలిటికల్‌ ట్విస్టుల మధ్య ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్‌ రిలీజ్‌

22 Sep, 2022 11:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నో పొలిటికల్‌ ట్విస్టుల మధ్య ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికకు గురువారం ఉదయం నోటిఫికేషన్‌ విడుదలైంది. కాగా, శనివారం(సెప్టెంబర్‌ 24) నుంచి 30వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. అయితే, అక్టోబర్‌ 17న ఎన్నికలు జరుగనుండగా.. 19న కౌంటింగ్‌ ఉండనుంది. 

ఇదిలా ఉండగా.. అధ్యక్ష బరిలో రాజస్తాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, ఎంపీ శశిథరూర్‌ ఉన్న విషయం తెలిసిందే. కాగా, ఈ రేసులో నేను కూడా ఉన్నానంటూ చివరి నిమిషంలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం దిగ్విజయ్‌ సింగ్‌ సైతం ఫ్రేమ్‌లోని వచ్చారు. ఈ సందర్భంగా దిగ్విజయ్‌ సింగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేశారు. దిగ్విజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరే పోటీ చేయాలా? నేను చేయకూడదా? అని అన్నారు. నన్నెందుకు పోటీ నుంచి తీసేస్తున్నారని ప్రశ్నించారు. నామినేషన్లకు చివరి తేదీ ఆయిన సెప్టెంబర్ 30న పోటీలో ఎవరెవరు ఉండేది తెలుస్తుందన్నారు. ఈ క్రమంలో గురువారం దిగ్విజయ్‌ సింగ్‌.. పార్టీ అధినేత్రి సోనియాను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. 

అంతేకాదు అధ్యక్ష పదవికి గాంధీ కుటుంబం నుంచి ఎవరూ పోటీ చేయకపోయినా ఎలాంటి ఆందోళన అవసరం లేదని దిగ్విజయ్ అన్నారు. ఆసక్తి ఉన్నవారు ఎవరైనా బరిలో ఉండవచ్చన్నారు. పోటీ చేయొద్దనుకునే వారిని బలవంతం చేయవద్దని సూచించారు. అధ్యక్షుడు కాకపోతే పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా రాహుల్ నిర్వర్తిస్తారని దిగ్విజయ్‌ స్పష్టం చేశారు. గాంధీలు పదవుల్లో లేనప్పుడు ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీని నడిపించిన విషయాన్ని గుర్తు చేశారు. 

మరిన్ని వార్తలు