‘ఇటుక’ చుట్టూ తమిళ రాజకీయం

27 Mar, 2021 17:41 IST|Sakshi

చెన్నె: కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఇచ్చిన హామీ నెరవేర్చలేదని తమిళ యువ నాయకుడు, డీఎంకే అధినేత స్టాలిన్‌ తనయుడు ఉదయనిధి వ్యంగ్యంగా విమర్శలు చేశాడు. అయితే ఆ విమర్శలు విన్న ప్రజలంతా నవ్వుకుంటుండగా బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఆ యువ నేత ‘ఇటుక’ దొంగతనం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విచిత్ర సంఘటన తమిళనాడులో జరిగింది. ఈ పరిణామంతో ఇటుక చుట్టూ తమిళ రాజకీయంగా తిరుగుతోంది.

గత మంగళవారం ఉదయనిధి స్టాలిన్‌ సత్తూరులో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఇచ్చిన ప్రధాన హామీని ప్రస్తావించి ఇరుకున పెట్టాడు. వాస్తవంగా మధురైకి ఎయిమ్స్‌ ఏర్పాటు చేస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. దీనికి సంబంధించి మధురైలోని తొప్పూర్‌లో 250 ఎకరాలు కేటాయించారు కూడా. ఆ పనులకు 2019 జనవరి 27వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఆ పనులేవీ సాగలేదు. దీనిని విమర్శిస్తూ ‘ఇదిగో మధురై ఎయిమ్స్‌ తీసుకొచ్చా’ అని ప్రచార ర్యాలీలో ఉదయనిధి ఓ ఇటుకను చూయించాడు. దానిపై నిమ్స్‌ అని రాసి ఉంది. ఇది చూసిన ప్రజలంతా ఫక్కున నవ్వారు. ఇది బీజేపీ తీరు అంటూ ఎయిమ్స్‌ ఇంకా నిర్మించలేదని ఎద్దేవా చేస్తూ ఇటుకను చూయించాడు. ఈ ఇటుకనే ఎయిమ్స్‌ అని ఉదయనిధి చెప్పాడు. మూడేళ్లల్లో అన్నాడీఎంకే, బీజేపీ ఏమీ చేసిందని ప్రశ్నించారు. 

అయితే ఇక్కడితో వివాదం సమసిపోలేదు. ఆ ఇటుకను ఉదయనిధి దొంగతనం చేశాడని ఓ బీజేపీ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం మరో వింత. ఎయిమ్స్‌లోని ఓ ఇటుకను ఉదయనిధి దొంగతనం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆ నిర్మాణాన్ని కాపాడాలని ఆ బీజేపీ నాయకుడు పోలీసులకు విజ్ఞప్తి చేశాడు. ఆ ఇటుకను తిరిగి తీసుకోవాలని కోరాడు. ఈ ఫిర్యాదును చూసి పోలీసులు అవాక్కయ్యారు.

మరిన్ని వార్తలు