ఆక్సిజన్‌ డిమాండ్‌పై రగడ: బీజేపీ, ఆప్‌ పరస్పరం విమర్శలు

27 Jun, 2021 09:41 IST|Sakshi

అది మధ్యంతర నివేదిక మాత్రమే

ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా

న్యూఢిల్లీ: ఢిల్లీలో కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో తీవ్ర ఆక్సిజన్‌ కొరత ఏర్పడటంపై సుప్రీం కోర్టు ప్యానెల్‌ అంద జేసిన నివేదికలోని అంశాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఆ ఆడిట్‌ రిపోర్టు మధ్యంతర నివేదిక మాత్రమేనని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా శనివారం స్పష్టం చేయగా.. దీనిని రాజకీయం చేయడం మాని, కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ రాకుండా కలిసికట్టుగా పనిచేయాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ కోరారు. సెకండ్‌ వేవ్‌ సమయంలో ఢిల్లీలో ఆక్సిజన్‌ అవసరాలను నాలుగింతలు చేసి చూపారంటూ నివేదికలో పేర్కొనడంపై శనివారం బీజేపీ, ఆప్‌ పరస్పరం విమర్శలు చేసుకోగా, ఆక్సిజన్‌ అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుకుంటుంటే కరోనాయే గెలుస్తుందని శనివారం కేజ్రీవాల్‌ ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు.

‘సెకండ్‌ వేవ్‌లో తీవ్ర ఆక్సిజన్‌ కొరత ఏర్పడింది. థర్డ్‌ వేవ్‌లో అలా జరక్కూడదు. మనలో మనం పోరాడుకుంటుంటే కరోనాయే గెలుస్తుంది. మనం కలిసి పోరాడితే దేశం గెలుస్తుంది’అని చెప్పారు. కాగా, ఈ వ్యవహారంపై గులేరియా స్పందిస్తూ.. ‘అది మధ్యంతర నివేదిక మాత్రమే. ఆ అంశం కోర్టు పరిధిలో ఉంది. ఆక్సిజన్‌ డిమాండ్‌ అనేది స్థిరంగా ఉండదు. రోజుకో తీరుగా మారుతుంటుంది’ అని చెప్పారు. సుప్రీంకోర్టు నియమించిన ఐదుగురు సభ్యుల ప్యానెల్‌కు గులేరియా నేతృత్వం వహించిన విషయం తెలిసిందే.

చదవండి:
నన్ను జైల్లోనే ఉంచేందుకు కుట్ర
జాతికి కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలి: బీజేపీ

 

మరిన్ని వార్తలు