Black Fungus: బ్లాక్‌ ఫంగస్‌ విస్తరిస్తోంది

16 May, 2021 06:31 IST|Sakshi

వైద్యులను హెచ్చరించిన ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్‌ గులేరియా

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కోవిడ్‌ బాధితుల్లో మ్యుకోర్‌మైకోసిన్‌ అనే అరుదైన ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌ కేసులు ఎక్కువగా వెలుగులోకి వస్తుండటంపై ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. కోవిడ్‌తో చికిత్స పొందుతున్న వారికి ఈ ఫంగస్‌ సోకుతుండటం ప్రస్తుత సెకండ్‌ వేవ్‌లోనే కనిపిస్తోందన్నారు. మ్యుకోర్‌మైకోసిన్‌(బ్లాక్‌ ఫంగస్‌) బారినపడే వారిలో 90 శాతం మంది డయాబెటిస్‌ బాధితులే ఉంటున్నారన్నారు. వీరి రక్తంలో చక్కెర స్థాయిలను పరిశీలిస్తూ నియంత్రించాల్సిన అవసరం ఉందని సూచించారు. శనివారం జరిగిన క్లినికల్‌ ఎక్స్‌లెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కార్యక్రమంలో ఈ మేరకు రాష్ట్రాలు, జిల్లా స్థాయి అధికారులను డాక్టర్‌ గులేరియా అప్రమత్తం చేశారు.

డయాబెటిస్‌ పేషెంట్లు, స్టెరాయిడ్లు తీసుకునే వారే ఎక్కువగా మ్యుకోర్‌మైకోసిన్‌ బారిన పడుతున్నట్లు ప్రస్తుతం పెరుగుతున్న కేసులను బట్టి తెలుస్తోందన్నారు. స్టెరాయిడ్ల వాడకం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగటానికి దారి తీస్తోందని తెలిపారు. గుజరాత్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 500కు పైగా మ్యుకోర్‌మైకోసిన్‌ కేసులను గుర్తించినట్లు అక్కడి వైద్యులు తెలిపారని ఆయన వెల్లడించారు.

కోవిడ్‌ పేషెంట్ల చికిత్సలో వాడుతున్న టోసిలిజుమాబ్‌ అనే ఔషధం ఫంగల్‌ ఇన్ఫెక్షన్‌కు దారితీస్తుందా అనే విషయాన్ని గుజరాత్‌ వైద్యులు పరిశీలిస్తున్నారని తెలిపారు. కోవిడ్‌బారిన పడిన తర్వాత కూడా డయాబెటిస్‌ పేషెంట్లు తమకు సూచించిన మందులు వాడకం కొనసాగించాలని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ శనివారం తెలిపారు. 

మరిన్ని వార్తలు