ఢిల్లీ ఎయిమ్స్‌ సర్వర్లపై సైబర్‌ దాడి.. చైనా హ్యాకర్ల పనే: కేంద్రం

14 Dec, 2022 16:48 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్‌​ సైన్సెస్​ (ఎయిమ్స్​)లోని సర్వర్లపై జరిగిన దాడి ఘటనలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఎయిమ్స్‌పై సైబర్‌ దాడి చైనా హ్యకర్ల పనేనని తేలింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. హ్యకింగ్‌కు గురైన లక్షల మంది రోగుల వివరాలను ఆసుపత్రి వర్గాలు తిరిగి పొందాయని పేర్కొంది.

‘ఎయిమ్స్‌ సర్వర్లపై దాడి చేసింది చైనీయులే. హ్యకింగ్‌ చైనా నుంచే జరిగినట్లు విచారణలో తేలింది. మొత్తం 100 సర్వర్‌లున్న ఢిల్లీ ఎయిమ్స్‌లో 40 ఫిజికల్‌గా 60 వర్చువల్‌గా పనిచేస్తున్నాయి.ఇందులో ఐదు ఫిజికల్ సర్వర్‌లలో హ్యకింగ్‌ జరిగింది. ఇది చాలా నష్టాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు హ్యకింగ్‌కు గురైన అయిదు సర్వర్‌లలోని డేటా విజయవంతంగా తిరిగి పొందాం’ అని కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది.

మొదట నవంబరు 23న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో సిస్టమ్స్‌ పనిచేయకపోవడాన్ని గుర్తించారు. రెండు రోజుల తర్వాత ఢిల్లీ పోలీస్‌లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ యూనిట్ ఎయిమ్స్‌లోని సర్వర్లలో హ్యకర్లు చొరబడినట్లు గుర్తించింది. అయితే సిస్టమ్‌ను పునరుద్ధరించేందుకు హ్యాకర్లు రూ. 200 కోట్లు క్రిప్టోకరెన్సీ రూపంలో చెల్లించాలని అడిగినట్లు వార్తలొచ్చాయి. అయితే ఈ విషయాన్ని పోలీసులు ఖండించారు. 

ఢిల్లీలోని ఎయిమ్స్ సర్వర్‌లపై  దాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ చేపట్టింది. వీవీఐపీలు సహా లక్షలాది రోగుల వైద్య రికార్డుల సమాచారం గాలికి పోయిన ఎయిమ్స్‌ ఘటన దేశంలోనే అతి పెద్ద సైబర్‌ దాడి. ఒక భారతీయ సంస్థపై ఇంత తీవ్రమైన దాడి మునుపెన్నడూ జరగలేదు అని దేశ తొలి సైబర్‌ సెక్యూరిటీ హెడ్‌ మాట. 
చదవండి: మీరు తాగొచ్చారు.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై ఆగ్రహంతో ఊగిపోయిన సీఎం

మరిన్ని వార్తలు